టీఆర్‌ఎస్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న విభేదాలు

17:05 - October 11, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు వారి వారి అభ్యర్థుల ప్రచారాలు జోరుగా జరుపుకుంటున్నారు. అయితే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌లో మాత్రం రోజు రోజుకూ విభేదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా...టీఆర్ ఎస్ లో ఎంపీకి - మాజీ ఎమ్మెల్యే మధ్య చెలరేగిన విబేధాలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. వివరాల్లోకి వెలితే... ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి - వైరా మాజీ ఎమ్మెల్యే మదనల్ లాల్ మధ్య రాజకీయ విబేధాలు ఉన్నాయి. ఇద్దరు టీఆర్ ఎస్ లోనే ఉన్నారు. గతంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగానే ఉండేది. ఆ తరువాత ఏర్పడిన విభేదాలు వ్యక్తిగతంగా - రాజకీయంగా దూరం చేశాయి. ప్రస్తుతం టీఆర్ ఎస్ అధిష్ఠానం మదన్ లాల్ కు ఈ సారి కూడా వైరాలో టిక్కెట్ ను కేటాయించింది. ఇది మింగుడపడని ఎంపి పొంగులేటి మండిపడ్డారు.  బహిరంగంగానే విమర్శలు చేస్తూ వైరా అంతటా మదనల్ లాల్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టించేశారు. అతనికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే కార్యకర్తలు ఎవరూ ఓట్లు వేయవద్దని ప్రచారం చేస్తున్నారు.  ఈ క్రమంలో ఎంపీ - మాజీ ఎమ్మెల్యే అనుచరులు రెండు వర్గాలు విడిపోయారు. ఓ పార్టీ కార్యక్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. వైరాలో చెలరేగిన రాజకీయ గొడవను చల్లార్చేందుకు టీఆర్ ఎస్ నేతలు ప్రయత్నించినా కుదరడం లేదు. మరోవైపు టీఆర్ ఎస్ అధిష్ఠానం పార్టీ అభ్యర్థులను మార్చేది లేదని తెగేసి చెప్పేసింది. ఎంపీ మాత్రం మార్చాల్సిందేనని పట్టువీడటం లేదు. మరి ఈ విభేదాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాల్సిందే!