టీఆర్‌ఎస్‌లో మరోసారి భగ్గుమన్న రాజీనామాల సెగ

16:43 - November 26, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తెరతీసింది టీఆర్‌ఎస్‌ పార్టీ. అయితే ముందుగానే అభ్యర్థులను కూడా ప్రకటించి అన్ని పార్టీలకు షాకిద్దామనుకున్న కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అభ్యర్థుల ప్రకటనతో టిక్కెటు దక్కని వాల్లలో నిరసన సెగ మొదలైంది. దీంతో కేసీఆర్‌కు లేనిపోని తలనొప్పి తగులుకుంది. అసలే ఈ సారి మిగిలిన పార్టీల నుంచి పోటాపోటీగా ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలబడ్డ వేల...తమ పార్టీలో వచ్చే ఈ నిరసన సెగకు కేసీఆర్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏదో విధంగా వారికి సర్దిచెప్పి ప్రచారంలో దిగిన కేసీఆర్‌కు మరోసారి తాజాగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 34 మంది పార్టీకి రాజీనామాలు చేశారు. ఇదంతా కేసీఆర్‌ నియంతృత్వం వల్లనే అని వారు చెప్తున్నారు. అసలు విషియంలోకి వస్తే...తుంగతుర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు చెందిన జడ్పీటీసీ, పలువురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. తిరుమలగిరి జడ్పీటీసీ పేరాల పూలమ్మ, తిరుమలగిరి మార్కెట్‌ మాజీ చైర్మన్‌ పాశం విజయయాదవరెడ్డి, అర్వపల్లి వైస్‌ ఎంపీపీ బొడ్డు వెంకన్నతో పాటు 34 మంది వివిధ స్థాయి తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఆదివారం మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. తిరుమలగిరి తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహం పాదాల వద్ద వారు తమ రాజీనామా పత్రాలను, టీఆర్‌ఎస్‌ పార్టీ కండువాలను ఉంచి పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ పేరాల పూలమ్మ, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పాశం యాదవరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ నాలుగేళ్లుగా జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలను, ఉద్యమ నాయకులను అగౌరవపర్చుతూ నియంతృత్వ ధోరణితో పాలన సాగించారని ఆరోపించారు. 14  ఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన వారిని పక్కన పెట్టి, పైరవీకారులను, ఇటీవల పార్టీలు మారి వచ్చిన వారిని ఏజెంట్లుగా పెట్టుకుని తమను కించపర్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఎన్నికల్లో కిషోర్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారే నేడు ఆయన పక్కన చేరారని అన్నారు. నాడు ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం ఊరూరా, గ్రామగ్రామాన తిరిగి గెలిపిస్తే తమను పక్కన పెట్టారని వాపోయారు. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో కిషోర్‌కుమార్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని, తమ అనుచరులతో మాట్లాడి ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయించుకుంటామన్నారు.