టీఆర్‌ఎస్‌ను పట్టుకున్న ఓటమి గుబులు

14:28 - October 29, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తెరతీసి, దానికి కావాల్సిన ఏర్పాట్లు ముందుగానే ఏర్పరుచుకోని, అసెంబ్లీ రద్దు చేసిన కేసీఆర్‌..అదే రోజు 105మంది అభ్యర్థులను కూడా ప్రకటించి గెలుపు ధీమా వ్యక్తం చేశారు. తరువాత కూడా టీఆర్‌ఎస్‌ గెలుపుపై ధీమాగా వున్న కేసీఆర్‌ ఇప్పుడు అది కాస్తా సన్నగిల్తుతున్నట్లు కనిపిస్తుంది. తాజా సర్వే రిపోర్టులను బట్టి ఇది నిజమే అనాలి. అనేక సర్వే సంస్థలు తమ అంచనాలు వెల్లడిస్తూ జనం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. టైమ్స్ నౌ గ్రూపుకు చెందిన ఈటీ నౌ కూడా ఇలాంటి ఓ సర్వే నిర్వహించి.. తాజాగా ఫలితాలను విడుదల చేసింది. ఈ సర్వే ఫలితాలు చూసి మహా కూటమి నేతలు - అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతుండగా.. టీఆర్ ఎస్ అభ్యర్థులు గుండెలు బాదుకుంటున్నారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మహాకూటమికే అడ్వాంటేజ్ ఉందని ఈటీ నౌ సర్వేలో తేలింది. ఈ కూటమికి 67-81 స్థానాలు వచ్చే అవకాశముందని అంచనా వేసింది. ఇక టీఆర్ ఎస్ కు 35-40 సీట్లు రావొచ్చని జోస్యం చెప్పింది. ఎంఐఎంకు 5-7 - బీజేపీకి 0-3 సీట్లు వస్తాయని ఈటీ నౌ సర్వే తేల్చింది. ప్రస్తుతం ఈ సర్వే ఫలితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పలు సర్వేలు తమ అంచనాలు వెల్లడించాయి. అయితే ఆ సంస్థల్లో చాలావరకు నిఖార్సైనవి కానే కావు. అయితే ప్రతిష్ఠాత్మక టైమ్స్ నౌ గ్రూపుకు చెందిన సంస్థ కావడంతో ఈటీ నౌ సర్వేను ఎవరూ తేలిగ్గా తీసుకోవడం లేదు. మరి ఈ సర్వే అంచనాలు నిజమవుతాయా? లేక కేసీఆర్ జాదూ చేసి తిరిగి జనాన్ని తనవైపుకు తిప్పుకుంటారా? అనే విషయాలు తెలియాలంటే డిసెంబరు 11 వరకు వేచి చూడాల్సిందే!