టిక్కెట్‌పై రూపాయి...ప్రయాణికులకు అధనపు భారం!

13:48 - October 21, 2018

ప్రయాణికుల సేవనే పరమావధిగా భావించి ముందుకుసాగాల్సిన రైల్వేశాఖ వారిపై అదనపు భారాన్ని మోపుతోంది. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) కొన్ని నెలలుగా నాణ్యమైన సేవలందిస్తున్న విషయం తెలిసిందే.
2017 సంవత్సరం నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ-టికెట్‌ బుకింగ్‌ చేసుకునే ప్రయాణికులకు రెల్వేశాఖ ఉచితంగా బీమా సౌకర్యం కల్పించింది. ఈ విధానం సరిగ్గా తొమ్మిది నెలలపాటు కొనసాగి గత నెలలో ముగిసింది. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలో బీమాను పొందకుండా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో ఈ-టికెట్‌ బుక్‌ చేసుకునేటప్పుడు బీమా (ఇన్సూరెన్స్‌) అదనంగా చేసుకునే విషయాన్ని వారి ఇష్టానికి వదిలేసింది. టికెట్‌ కోసం వివరాలు సమర్పించే సమయంలో బీమాను ఒక ఆప్షన్‌గా ఇస్తున్నారు. బీమా కావాల్సిన వారి నుంచి రూ.1 అదనంగా తీసుకుంటున్నారు. బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రైవేట్‌ కంపెనీలు ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్‌ ఫైనాన్స్‌తో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో బీమా తీసుకున్న ప్రయాణికులు రైళ్లలో వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షలు, శాశ్వతంగా అంగవైకల్యం పొందితే రూ. 7.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ రైళ్లతోపాటు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో టికెట్లు పొందిన ప్రతి ప్రయాణికుడికి ఉచితంగా బీమా సదుపాయాన్ని కల్పించాల్సింది పోయి, టికెట్‌పై అదనంగా తీసుకుంటూ ప్రైవే ట్‌ సంస్థలకు లాభం చేకూర్చడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఐఆర్‌సీటీసీ టికెట్‌పై అదనంగా తీసుకునే రూ.1 ఆప్షన్‌ను వెంటనే తొలగించాలని వారు కోరుతున్నారు.  ఐఆర్‌సీటీసీలో ఇప్పటివరకు బీమా నమోదు చేసుకున్న వారి సంఖ్య : 3 కోట్లు,  ప్రతి రోజూ జరిగే బుకింగ్‌లు : 5 లక్షల నుంచి 13 లక్షల వరకు, నెలకు వసూలయ్యే బీమా : రూ.1.5కోట్ల నుంచి రూ. 3.9కోట్ల వరకు,  ఏడాదికి వసూలయ్యే బీమా : రూ.18కోట్ల నుంచి రూ. 48కోట్ల వరకు...