టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన చెర్రీ నిర్ణయం

11:48 - December 22, 2018

గన్‌షాట్ హిట్ అనుకొనే సినిమాల మీద ఎవరైనా ఎంత పెట్టుబడి అయినా పెట్టవచ్చు. అయితే ఆ పెట్టుబడి పెట్టేది ఆ సినిమా హీరోనే అయితే.. అది ఖచ్చితంగా ఆశ్చర్యపరిచే విషయమే. '' వినయ విధేయ రామ, ఆర్.ఆర్.ఆర్ '' చిత్రాల విషయంలో రామ్ చరణ్ పారితోషానికి బదులుగా లాభాల్లో వాటాలు అడగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిర్మాత డి.వి.వి దానయ్యతో దానికి సంబంధించిన డీల్ కుదుర్చుకున్నాడట చెర్రీ. నిజానికి ' ఆర్.ఆర్.ఆర్ ' చిత్రం విషయంలో దానయ్య మరో ఇన్వెస్టర్‌ను చూస్తున్నాడట. అందుకే చెర్రీ ప్రపోజల్‌కు ఓకే చెప్పాడట దానయ్య. సినిమాల నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నచెర్రీ.. దానయ్యకు కాస్త సపోర్ట్‌గా కూడా ఉంటుందనే పారితోషికం తీసుకోకుండా ' ఆర్.ఆర్.ఆర్ ' చిత్రానికి ఇలా స్లీపింగ్ పార్ట్‌నర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ,రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి '  ఆర్.ఆర్.ఆర్ ' మల్టీస్టారర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య రూ.300 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే దీనికన్నా ముందే చెర్రీతో దానయ్య ' వినయ విధేయ రామ ' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్‌కు క్రేజ్ దృష్ట్యా 18 నుంచి 20  కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు. '  రంగస్థలం ' చిత్రం ఘనవిజయంతో క్రేజ్ పెరిగిన నేపథ్యంలో దానయ్య ఒక్కో ప్రాజెక్టుకు 20 కోట్లకు డీల్ మాట్లాడుకున్నాడుట. అలా దానయ్య నిర్మిస్తోన్న ఈ రెండు సినిమాలకు కలిపి తనకు పారితోషికంగా రావల్సిన మొత్తం రూ. 40 కోట్లను ఆర్.ఆర్.ఆర్ మీద పెట్టుబడిగా పెడుతున్నాడట చెర్రీ. సినిమా హిట్ అయితే వచ్చిన లాభాల్లో పర్సంటేజ్ తీసుకుంటానని చెప్పాడట రామ్ చరణ్. మరి వచ్చే జనవరి 11న విడుదల కానున్న ' వినయ విధేయ రామ ', 2020 లో విడుదల కానున్న ' ఆర్.ఆర్.ఆర్ ' చిత్రాలు రెండూ చెర్రీకి ఏ స్థాయిలో లాభాలు తెచ్చిపెడతాయో చూడాలి.