టచ్‌ మీ నాట్‌

13:43 - August 16, 2018

టచ్‌ మీ నాట్‌ అనే మొక్కను మనం చూసే ఉంటాం. మన చేతితో తాకినా, ఏదైనా కీటకం వాలినా, నీటి చుక్కలు పడినా, పెద్దగా గాలి వీచినా ఈ మొక్క ఆకులు వెంటనే ముడుచుకుపోతాయి. మళ్ళీ తిరిగి యదాస్థితికి రావడానికి గంట వరకూ సమయం పడుతుంది. 
మనం అత్తిపత్తి అని తెలుగులో పిలిచే ఈ మొక్క శాస్త్రీయ నామం మైమోసా పూడికా. ఇందులో పూడికా అటే సిగ్గు అని అర్ధం.
ఏదైనా స్పర్శ తగలగాపూ ముడుచుకునే లక్షణం కలిగిన '' టచ్‌ మీ నాట్‌ '' అనే మొక్క ఆత్మ రక్షణలో భాగంగానే అలా చేస్తుంది. ఏ జంతువులైనా ఈ మొక్కలను తినటానికి వచ్చినప్పుడు టచ్‌ కాగానే ఆకులు ముడుచుకుపోవడంతో జంతువులు వాటిని తినకుండా వెళ్ళిపోతుంటాయి. అలా ఆ మొక్క తనను తాను కాపాడుకుంటుంది. 
వాస్తవానికి టచ్‌ మీ నాట్‌ మొక్కల పత్ర కణజాలాలలో నిండుగా నీరుంటుంది. అలాంటప్పుడు అవి నిటారుగా ఉంటాయి. ఏధైనా స్పర్శ తగిలినప్పుడు లేక కాంతి తగ్గినప్పుడు ఆ ఆకుల కణజాలాల్లోని నీరు స్థాన భ్రంశం చెందుతుంది. అప్పుడు అవి గాలి తీసిన బుడగల్లా చట్టుక్కున ముడుచుకుంటాయి.