జాతీయ మీడియాపై మోడీ ప్రభావం

11:39 - November 19, 2018

గల్లీ మీడియాను సిల్లీగా తీసి పారేయటం మామూలే. గల్లీ మీడియా ఈకగా మారి ఎంతో కాలమైంది. ఇక.. స్టేట్ మీడియా కూడా అలాంటి పరిస్థితే దాపురించి కొన్ని సంవత్సరాలైంది. .ముక్కుముఖం తెలీనోళ్లు.. మీడియా అంటే అవగాహన లేకున్నా చేతిలో ఉన్న కోట్లను కుమ్మరించేయటం.. మీడియా సంస్థల్ని స్థాపించటం ఎక్కువైంది. ఎప్పుడైతే ఎమ్మెల్యే స్థాయి నేత.. మీడియా అధినేతతో నేరుగా మాట్లాడటం.. తమ అవసరాలు తీర్చుకోవటం పెరిగిందో పాత్రికేయానికి ఉన్న కొద్దిపాటి మర్యాద.. గౌరవం గంగలో కలిసిపోయింది. స్టేట్ మీడియాలో పరిస్థితులకు తగ్గట్లే జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు మార్పులు వచ్చేశాయి. ఏదైనా జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపించే కుంభకోణాల మీద విస్తృతంగా వార్తలు ఇవ్వటం మొదటినుంచి ఎక్కువే. కానీ.. మోడీ మాష్టారి ఎంట్రీతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది.   మోడీ సాబ్కు వ్యతిరేకంగా కానీ.. వారి మనోభావాలు దెబ్బ తినేలా కానీ.. వారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అంశాలేవీ వార్తలుగా బయటకు రాకూడదన్నది ఇప్పుడు అప్రకటిత రూల్ గా మారినట్లుగా చెబుతున్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఆరు రాష్ట్రాల్లో  (తెలంగాణ.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. సిక్కిం.. చత్తీస్ గఢ్.. మిజోరం)   బీజేపీ గెలుపు ఎక్కడా? అన్న క్వశ్చన్ కు వెంటనే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ ఆరు రాష్ట్రాల్లో అయితే ఒక్క రాష్ట్రంలో మినహా మరే రాష్ట్రంలోనూ కమలం తన ప్రభావాన్ని చూపలేవన్న మాటను అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అయితే.. జాతీయ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా మోడీ గాలి వీస్తుందన్న మాట అదే పనిగా చెబుతున్నారు.  మరి.. వాస్తవం ఏమిటన్న విషయంలోకి వెళితే.. హైదరాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్టులు కొందరు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్.. మధ్యప్రదేశ్..ఛత్తీస్ గఢ్.. రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నట్లుగా వారు చెప్పారు. సామాన్య జనం అనుకుంటున్న దానికి.. జాతీయ మీడియాలో వస్తున్న వార్తలకు ఏ మాత్రం పొంతన లేదని వారు చెబుతున్నారు. మోడీ బ్యాచ్ భజనలో మునిగి తేలుతున్న నేషనల్ మీడియా తాజా ఎన్నికల ఫలితాలు షాకింగ్ గా మారటమే కాదు.. వాటి ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేయటం ఖాయమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.