జగన్‌పై కత్తితో దాడి

14:11 - October 25, 2018

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్లో ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఒక వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగన్ ఎడమ భుజానికి స్వల్ప గాయమైంది. ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది ఒక్కసారి షాక్ తిన్నారు. వెంటనే.. ఆ వ్యక్తిని ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.  ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్.. శుక్రవారం నాంపల్లి కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు విశాఖ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. ఇందులో భాగంగా ఆయన విశాఖ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. విమానం బయలుదేరటానికి సమయం ఉండటంతో వీఐపీ లాంజ్ లో ఆయన వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో జగన్ వద్దకు వచ్చిన వెయిటర్ ఆయనతో మాట్లాడుతూనే.. చిన్నకత్తితో ఆయనపై దాడి చేశారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది నిందితుడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయాన్ని మూసివేశారు. మరోవైపు.. జగన్ భుజానికి అయిన గాయానికి వైద్యులు చికిత్స చేశారు. జగన్ పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని శ్రీనివాస్ గా గుర్తించారు. అతడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది