జక్కన్నకు అది కత్తి మీద సాము లాంటిదే!

17:15 - October 31, 2018

హీరోయిజం ఎలివేట్ చేసి చూపడంలో దాని గురించి అభిమానులు సంవత్సరాల తరబడి చర్చించుకుంటూ ఉండేలా చేయడంలో రాజమౌళి స్టైల్ వేరు. సింహాద్రి మొదలుకుని మొన్నటి బాహుబలి దాకా జక్కన్న మలిచిన ప్రతి నాయక శిల్పాలన్నీ గొప్ప కెరీర్ అందుకున్నాయి.  సై ప్రదీప్ రావత్ కు కెరీర్ ఇస్తే సింహాద్రి ముఖేష్ ఋషిని ఏళ్ళ తరబడి బిజీ ఆర్టిస్టుని చేసింది. విక్రమార్కుడు అజయ్ లెవెల్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. బాహుబలి గురించి చెప్పేదేముంది. హీరోగా కంటే సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రానా మార్కెట్ ఎన్నో రేట్లు పెరిగిపోయింది. సోలో హీరోల సినిమాలకే విలన్ల విషయంలో ఇంత శ్రద్ధ తీసుకునే రాజమౌళి ఇప్పుడు కత్తి మీద సాము లాంటి కొణిదెల నందమూరి హీరోల కాంబినేషన్ లో తీస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ కు ఎలాంటి విలన్ ను తీసుకొస్తాడు అనే ఉత్సుకత కలగడం సహజం. ఈ ఏడాది భీభత్సమైన విలనీతో అదరగొట్టిన జగపతి బాబునే తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది కానీ అది నిజం కావొచ్చు కాకపోవచ్చు. లేదా నార్త్ నుంచి ఎవరినైనా దిగుమతి చేసుకునే ఆలోచన ఉందేమో చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక హీరో కాదు. వాళ్ళ కంటే శక్తిమంతంగా కనిపిస్తూ ఇద్దరికీ సవాల్ విసిరే భారీ కాయం అవసరం.ఇది సవాల్ లాంటిదే. కానీ వాటికి తలొగ్గితే అతను రాజమౌళి ఎందుకు అవుతాడు అని అభిమానులు అంటారు కానీ నిజంగా ఎవరు ఉంటారా అనే సస్పెన్స్ మాత్రం ఫ్యాన్స్ మెదళ్లను బాగా తొలిచేస్తోంది.