చివరకి ఒకే అయిందట! కానీ..

12:16 - November 26, 2018

అల్లు అర్జున్‌ ' నా పేరు సూర్య ' తరువాత చాలా గ్యాప్‌ తీసుకున్నారు. నెక్స్ట్‌ సినిమా ఎప్పుడు?, ఏంటీ? అని ఎన్ని సార్లు, ఎన్ని ఫంక్షన్లలో ప్రేక్షకులు అడిగినా కానీ ఆ మాటను దాటేస్తూ వెళ్లారే తప్ప సమాధానం చెప్పలేదు. అయితే ఎట్టకేలకు చివరకు త్రివిక్రమ్‌తో సినిమా తీస్తున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఇదిలా వుంటే... అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలైన నెల గ్యాప్ లోనే విక్రమ్ కుమార్ తో ఒక చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు అంటూ అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే నా పేరు సూర్య చిత్రం ఫలితం బన్నీని ఆలోచనలో పడేసింది. దాంతో విక్రమ్ కుమార్ రెడీ చేసిన కథకు మార్పులు చేర్పులు చెప్పడం జరిగింది. దాదాపు మూడు నాలుగు నెలలు కూర్చున్నా కూడా విక్రమ్ కుమార్ కథను అల్లు అర్జున్ అండ్ కో కు నచ్చే విధంగా రెడీ చేయలేక పోయాడట. ఈలోపు త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ చిత్రంను పూర్తి చేసుకుని బన్నీతో సినిమాకు రెడీ అయ్యాడు. దాంతో విక్రమ్ కుమార్ మరో ప్రాజెక్ట్ ను చూసుకుంటున్నాడు. ఈ సమయంలోనే ఒక తమిళ రచయిత చెప్పిన కథ బాగా నచ్చడంతో అల్లు అర్జున్ అండ్ టీం ఆ కథను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారట.ఈ చిత్రంను స్వయంగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.