చిన్మయి చేసిన ఆరోపణలతో కోలివుడ్‌ దిగ్బ్రాంతి

13:12 - October 10, 2018

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్న సందేశాలు కోలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. 8 ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ మూడ్రోజుల క్రితం షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది చిన్మయి.  తాజాగా  చిన్మయి చేసిన ఆరోపణకు కోలివుడ్‌ దిగ్బ్రాంతికి గురైంది. మనవరాలి వయసులో ఉన్న తనను తమిళ సినీ దిగ్గజం, ప్రముఖ గేయ రచయిత కవిపేరరసు వైరముత్తు  లైంగికంగా వేధించారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే సినీ రంగంలో, రాజకీయంగాను పలుకుబడి ఉన్న వైరముత్తు వల్ల ఇకపై తనకు సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు రాకపోయినా లెక్కచేయనని, తన మాటలకు కట్టుబడి ఉన్నానని మంగళవారం చిన్మయి ట్విట్టర్‌లో పేర్కొంది. ఆమె చేస్తున్న ' మీ టూ' పోరాటానికి తారలు సమంత, వరలక్ష్మి కూడా మద్దతు పలికారు. అయితే వైరముత్తుపై చిన్మయి చేస్తున్న ఆరోపణలకు కొందరు పాజిటివ్‌గా, మరికొందరు నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. అందుకు కూడా చిన్మయి బదులిచ్చింది. వైరముత్తు సార్‌ ఆఫీస్‌లోని సిబ్బందికి, సన్నిహితులకు అసలు విషయం తెలుసని, ఏం చేశారో వైరముత్తుకు కూడా తెలుసని పేర్కొంటూ... ' ఇది నా కథ '. ' యదార్థమైన కథ . ఒకవేళ ఇకపై నాకు పాట పాడేందుకు లేదా డబ్బింగ్‌ చెప్పేందుకు అవకాశాలు రాకపోయినా లెక్కచేయను ' అని మరో ట్వీట్‌ చేసింది.