చిన్నారులకు శరీర భాగాలు పెరిగేలా హార్మోన్‌ ఇంజక్షన్‌లు

11:04 - October 23, 2018

యాదాద్రిలో బాలికలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నా అధికార యంత్రాంగం మిన్నకుండడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల శరీరాలు పెరిగేలా హార్మోన్‌ ఇంజక్షన్లు ఇచ్చి వారిని వ్యభిచార కూపంలోకి దించుతున్నా ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాలికలను వ్యభిచార కూపంలోకి దించకుండా తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ఆదేశించింది. అధికారులకు తెలియకుండా ఇదంతా జరిగి ఉంటుందని తాము భావించడం లేదని, నిర్వాహకులతో సంబంధిత అధికారులు లాలూచీపడ్డట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుల బెయిలు వ్యాజ్యాలను సంబంధిత పీపీలు వ్యతిరేకించారా అని ప్రశ్నించింది. ఈ కేసుల విచారణకు సిట్‌ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయాలని సూచించింది. ఇటువంటి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేలా ఆదేశాలిచ్చేందుకు కూడా తాము సిద్ధమని స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాధిత చిన్నారులకు పరిహారం ఇచ్చామని అదనపు ఏజీ జె.రామచందర్‌రావు కోర్టుకు వివరణ ఇచ్చారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంత తీవ్రమైన కేసుల్లో బాధిత చిన్నారులకు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదని, చిన్నారుల రక్షణ కోసం చర్యలు చేపట్టడంతోపాటు బాధ్యులపైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది. సిట్‌ను ఏర్పాటు చేసి అందులో మహిళా అధికారులను కూడా నియమించాలని అభిప్రాయపడింది. ఈ ఘటనపై పోలీసులు 22 మందిపై ఐపీసీ సెక్షన్లు 361, 367లతోపాటు మనుషుల అక్రమ రవాణా, పోస్కో చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అదనపు ఏజీ నివేదించారు. పురోగతిపై వివరణ ఇచ్చేందుకు డీసీపీని మంగళవారం స్వయంగా హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. యాదాద్రిలో చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారంటూ ఇటీవల వచ్చిన కథనాన్ని సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన ధర్మాసనం సోమవారం విచారించింది.