చిన్నమ్మను తానింకా వదిలిపెట్టలేదంట!

10:59 - October 25, 2018

కొంతమంది అధికారులు చాలా మొండిగా ఉంటారు. ఎదురుదెబ్బ తగిలినా వెనక్కి తగ్గక వెయిట్ చేసే వారి తీరు కొందరు నేతలకు చెమటలు పట్టిస్తూ  ఉంటారు. అలాంటి తీరునే ప్రదర్శించి వార్తల్లోకి వచ్చారు సీనియర్ పోలీసు అధికారి రూపా డి మౌధిల్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ అలియాస్ శశికళకు జైల్లో అందుతున్న రాజభోగాల గురించి బయటకు చెప్పి సంచలనం సృష్టించిన మహిళా పోలీసు అధికారిణి గుర్తున్నారా? ఆమే.. ఈ రూప.  తన కంటే ఉన్నతాధికారి అయిన సత్యనారాయణపై ఆరోపణలు చేసిన ఆమె తీరు అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారం అప్పటి సిద్దరామయ్య ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారి..ఇద్దరిపైనా బదిలీ వేటు వేశారు. చిన్నమ్మ వ్యవహారంలో వేలు పెట్టి బదిలీ వేటు పడినా రూప మాత్రం ఆ ఇష్యూను వదిలేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. అప్పట్లో తాను చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఒక కమిషన్ ను నియమించింది సిద్దరామయ్య సర్కారు. దీనికి తగ్గట్లే ఆ కమిషన్ తమ పని పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆ నివేదిక వివరాలు తనకు ఇవ్వాలంటూ రూప.. సమాచార హక్కు కింద దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర ఉన్న ఆ నివేదికలోని అంశాల్ని తనకు చెప్పాలంటూ అప్లికేషన్ పెట్టారు. తాజాగా ఇదే విషయాన్ని మీడియాకు చెప్పి.. చిన్నమ్మను తానింకా వదిలిపెట్టలేదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.