చంద్రుడిపై మంచు

16:48 - August 22, 2018

 చంద్రుడి ధృవాల్లో ఉండే అత్యంత చల్లని ప్రదేశాల్లో మంచు ఉందని చంద్రయాన్‌-1 ఇచ్చిన సమాచారం నిజమేనని నాసా స్పష్టంచేసింది. పదేండ్ల కిందట మన ఇస్రో పంపిన చంద్రయాన్‌ 1 స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడిపై మంచు ఉన్న విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా కూడా ఇదే చెబుతున్నది.భవిష్యత్తులో చంద్రుడిపై నివాసం ఉండటానికి ఈ ఘనీభవించిన నీరు చాలా ఉపయోగపడుతుందని నాసా అభిప్రాయపడింది. చంద్రుడి ఉపరితలం అడుగున ఉన్న నీటి కంటే ఈ నీటిని వాడుకోవడం కూడా సులువని తెలిపింది. చంద్రుడి ఉత్తర దృవంలో అక్కడక్కడా మంచు పోగుబడి ఉండగా...దక్షిణ దృవంలో మంచంతా ఒకేచోట ఉందని  నాసా తాజా అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయన వివరాలను పీఎన్‌ఏఎస్‌ జర్నల్‌లో ప్రచురించారు.

నాసాకు చెందిన మూన్‌ మినరాలజీ మ్యాపర్‌ (ఎం3) పంపిన డేటా ఆధారంగా చంద్రుడిపై మంచు రూపంలో నీరు ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి ఈ ఎం3ని చంద్రుడిపై మోసుకెళ్లింది మన చంద్రయాన్‌ 1 స్పేస్‌క్రాఫ్టే. చంద్రుడిపై ఉన్నది నీళ్లా లేక ఆవిరా లేక ఘనీభవించిన మంచా అన్నదానికి సంబంధించిన డేటాను కూడా ఈ ఎం3 సేకరించింది. చంద్రుడి ధృవాల్లో ఉన్న అర్ధచంద్రాకారపు భారీ లోయల్లో ఈ మంచు పేరుకుపోయినట్టు గుర్తించారు. ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఎప్పుడూ మైనస్‌ 156 డిగ్రీల కంటే ఎక్కువ ఉండవు. చంద్రుడి కక్ష్యలో ఉన్న వంపు కారణంగా ఈ ప్రాంతాలపై ఎప్పుడూ సూర్య కిరణాలు పడవు.