ఘన విజయం సాధించిన భారత్‌

11:29 - December 10, 2018

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్88  ఓవర్లలో 250  పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో పుజారా(123) మినహా మిగితా వారు ఊహించినంతగా రాణించలేదు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ టాప్ ఆర్డర్ కూడా విఫలమైంది. ఈ దశలో ట్రావిస్ హెడ్ నిలకడగా ఆడుతూ.. జట్టుకు 235 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తొడ్పడ్డాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 307 పరుగులు చేసి ఆలౌటై 323  పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. అయితే నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఐదో రోజు ఆట ప్రారంభంలోనే ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో జట్టుకు అండగా నిలిచిన ట్రావిస్ హెడ్‌(14)ను ఇషాంత్ శర్మ పెవిలియన్ బాటపట్టించాడు. ఇషాంత్ వేసిన 57వ ఓవర్ నాలుగో బంతికి హెడ్ రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ టిమ్ పైన్‌తో కలిసి షాన్ మార్ష్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో 146 బంతుల్లో 52 పరుగులు చేసి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ తొలి అర్థ శతకాన్ని సాధించాడు. మరోవైపు పైన్ కూడా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదురుకుంటూ.. బ్యాటింగ్ చేయసాగాడు. అయితే వీరిద్దరి భాగస్వామ్యానికి బుమ్రా వేసిన 73వ ఓవర్‌లో తెరపడింది. ఈ ఓవర్ తొలి బంతికి మార్ష్(60)కీపర్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కి వచ్చిన పాట్ కమ్మిన్స్‌తో కలిసి పైన్ వికెట్ కాపాడుకుంటూ.. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నారు. కమ్మిన్స్ తన వికెట్ కాపాడుతూ.. జట్టుకు విజయాన్ని అందించేందుకు కృషి చేశాడు. మరో వైపు ఆసీస్ టెయిల్ ఎండర్స్ భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ.. స్కోర్ సాధించేందుకు కృషి చేశారు. కానీ ఆసీస్ బ్యాట్స్‌మెన్ల పోరాటానికి తగిన ఫలితం దక్కలేదు. రెండో ఇన్నింగ్స్‌ల్లో 119.5  ఓవర్లలో ఆస్ట్రేలియా 291 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో భారత్ ఈ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ని 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి ఈ గెలుపును సొంతం చేసుకుంది.