గులాబీకి బై చెప్పి..ఆ ముగ్గురూ..కాంగ్రెస్‌లోకి జంప్‌

12:31 - October 27, 2018

ఒకేసారి ముగ్గురు నేతల టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లోకి చేరారు. ఆ ముగ్గురు నేతలు ఎవరనేది చూస్తే...రాజ్యసభ సభ్యుడైన సీనియర్ నేత డీ శ్రీనివాస్ - టీఆర్ ఎస్ వ్యవస్థాపక సభ్యుడు అయిన ఎమ్మెల్సీ రాములు నాయక్ - మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గులాబీ  పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన డీఎస్ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. జాతీయ స్థాయిలో డీఎస్కు ఉన్న పరిచయాల దృష్ట్యా టీఆర్ ఎస్ నాయకత్వం ఆయనను రాజ్యసభకు  పంపింది. అయితే అనంతరం పరిణామాలు మారాయి. నిజామాబాద్ రాజకీయాల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ  జిల్లా టీఆర్ ఎస్ నేతలు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఓ వైపు ఈ ఫిర్యాదు మరోవైపు నిజామాబాద్ జిల్లాలో తన కూతురు కవిత కీలకంగా వ్యవహరిస్తుండగా.. నిజామాబాద్ రాజకీయాల్లో డీఎస్ జోక్యం పెరిగిందని భావించిన కేసీఆర్... ఆయనను పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టారనే టాక్ కూడా ఉంది. దీంతో కేసీఆర్ తీరుపై అసహనంతో ఉన్న డీఎస్... కాంగ్రెస్‌లోకి చేరారు. మరోవైపు టీఆర్ ఎస్ వ్యవస్థాపక సభ్యుడు అయిన ఎమ్మెల్సీ రాములు నాయక్ నారాయణఖేడ్ టికెట్ ను ఆశించారు. అయితే ఆయనకు నో చెప్పడంతో పాటుగా సస్పెండ్ చేయడంతో తిరుగుబాటు జెండా ఎగురవేసి గత కొంతకాలంగా కేసీఆర్పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆయన సైతం  కాంగ్రెస్‌లోకి చేరారు.. గత ఎన్నికల్లో కేసీఆర్ చేతిలో ఓడిపోయి కొద్దికాలానికి టీఆర్ ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి  సైతం తిరిగి కాంగ్రెస్ పార్టీలో  చేరారు..