ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి చేదు అనుభవం

11:06 - December 1, 2018

తెలంగాణలో ఎన్నికలకు పోలింగ్‌ డేట్‌ దగ్గర పడటంతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ప్రచారానికి వెళ్లిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్లితే... ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాణోత్‌ మదన్‌లాల్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.  ప్రచారంలో భాగంగా కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్‌ తండాకు వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను అడ్డుకున్నారు. కొంతకాలంగా మదన్‌లాల్‌ లంబాడాలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన ప్రచార వాహనం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మదన్‌లాల్‌ తమ గ్రామంలో పర్యటించడానికి అంగీకరించబోమన్నారు. ఈ క్రమంలో మదన్‌లాల్‌ అనుకూలురు కొందరు స్థానికులతో వాదనకు దిగారు. అయితే.. ఈ విషయం ముందుగానే పసిగట్టిన పోలీసులు అప్పటికే గ్రామానికి వచ్చారు. ఇరువర్గాలనూ శాంతింపజేశారు. అనంతరం మదన్‌లాల్‌ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు.