క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డ్వాన్‌ బ్రావో

15:36 - October 25, 2018

వెస్టిండీస్ క్రికెటర్, ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. తన రిటైర్‌మెంట్ నోట్‌లో బ్రావో పలు విషయాలను ప్రస్తావించాడు. 2004 ఏప్రిల్‌లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మెరూన్ క్యాప్ అందుకున్న క్షణాన్ని తానిప్పటికీ మర్చిపోలేనని బ్రావో గుర్తుచేసుకున్నాడు. 2004లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేతో బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేశాడు. మూడు నెలల తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో తన టెస్ట్ మ్యాచ్ కెరీర్‌ను మొదలుపెట్టాడు. 2016 సెప్టెంబర్‌లో విండీస్ తరపున బ్రావో చివరిసారిగా ఆడాడు. అప్పటి నుంచే బ్రావో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత.. బ్రావో తాజా ప్రకటనతో ఈ ప్రచారమే నిజమైంది. బ్రావో ఆడిన 270 మ్యాచ్‌ల్లో 40 టెస్ట్ మ్యాచ్‌లు, 164 వన్డే మ్యాచ్‌లు, 66 టీ20 మ్యాచ్‌లు ఉండటం విశేషం. ఆల్‌రౌండర్‌గా తన ఆటతీరుతో ఆకట్టుకున్న బ్రావో 164వన్డే మ్యాచ్‌ల్లో 2,968 పరుగులు చేసి, 199 వికెట్లు తీశాడు.