కౌశల్‌ను హౌస్‌ నుంచి గెంటేయండి : కత్తి మహేష్‌

13:04 - September 24, 2018

బిగ్‌బాస్‌ సీజన్‌2 ఇంకొక వారంలో ముగియనుంది. ఈ వారంలో హౌజ్‌లో మిగిలిన సభ్యులు కౌశల్‌, సామ్రాట్‌, దీప్తీ, గీతామాధరి, తనిష్‌. ఇప్పుడు వీరిలో ఎవరికైతే ప్రేక్షకులు ఎక్కువ ఓట్లు వేస్తారో వారు బిగ్‌బాస్‌ టైటిల్‌ తీసుకునేందుకు అర్హులవుతారు. అయితే ప్రతి సారీ ఏదో ఒక విషియంలో, ఎవరిపైనో ఒకరిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కే కత్తి మహేష్‌...ఇప్పుడు హౌస్‌లోని కౌశల్‌పై దాడి మొదలు పెట్టారు. 

కౌశల్‌ని గెలిపించాలని అతని ఆర్మీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అన్ని చోట్లా 2కె రన్ నిర్వహిస్తూ క్యాంపెయిన్ చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా కౌశల్ గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కౌశల్ గురించి బిగ్‌బాస్ సీజన్ 1 పార్టిసిపెంట్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్‌లో ఇటీవల గొడవ జరిగిన నేపథ్యంలో ' కౌశల్ అంతా కోల్పోయాడు.. అతన్ని హౌస్ నుంచి బయటకు గెంటేయండి' అని ట్వీట్ పెట్టారు కత్తి మహేష్. 

శనివారం నాని కౌశల్‌ని ప్రశ్నించిన నేపథ్యంలో 'చాలా పేలవమైన, విసుగుపుట్టించే సమాధానం చెప్పాడు కౌశల్. బిగ్‌బాస్ చరిత్రలోనే చాలా చిరాకు తెప్పించే వ్యక్తి ' అని ట్వీట్ చేశారు. తాజాగా మరో అడుగు ముందుకేసి సంచలన ట్వీట్ పెట్టారు. 'కౌశల్ బిగ్‌బాస్ 2లోనే చాలా విసుగు తెప్పించే వ్యక్తి. ఒకవేళ అతను బిగ్‌బాస్ 2 గెలిస్తే మనమెంత ఇడియట్స్ అనేది ప్రూవ్ అవుతుంది' అని కత్తి మహేష్ పేర్కొన్నారు. తాను దీప్తి నల్లమోతు తరుఫున క్యాంపెయిన్ నిర్వహిస్తానని ఫేస్‌బుక్ ద్వారా మహేష్ తెలిపారు.

అసలే బయట కౌశల్‌ ఆర్మీ కి ఎంత ఫాలోయింగ్‌ వుందో అందరికీ తెలిసిందే. ఈ సమయంలో కౌశల్‌ పై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలకు కౌశల్‌ ఆర్మీ వూరుకుంటుందా?..అస్సలు వూరుకోదనే చెప్పాలి. ఎందుకంటే కత్తి మహేష్‌, కౌశల్‌ పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే అతనికి ప్రశ్నలు వచ్చాయి. కత్తి మహేష్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఓ యువతి '  ప్రజలు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్లనే మీరెందుకు టార్గెట్ చేస్తారు' అని ప్రశ్నిస్తే.. ప్రజల ఒపీనియన్‌తో తనకు సంబంధం లేదని.. తన దారిలో తాను వెళతానని స్పష్టం చేశారు. గతంలో పవన్ కల్యాణ్‌పై ఇలాగే కత్తి దూసిన మహేష్.. ఈ మధ్య సైలెంట్ అయ్యారు. తాజాగా కౌశల్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆంతర్యమేమై ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఇలా ఎవరితోనూ సంబందం లేకుండా అతనికి అనిపించింది మాట్లాడే కత్తి మహేష్‌ మాటలకు, కౌశల్‌ ఆర్మీ ఇచ్చే రియాక్షన్‌ ఎలా వుంటుందో చూడాల్సిందే. మొత్తానికి కత్తి మహేష్‌ మరో వివాదంలో కాలు పెట్టినట్టే.