కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చిన పరుశురామ్‌

14:29 - August 29, 2018

దర్శకుడు పరశురామ్ ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్నాడు.  పరశురామ్  కెరీర్లో ఇప్పటిదాకా  తీసిన సినిమాలన్నీ ఒకెత్తయితే.. ‘గీత గోవిందం’ మరో ఎత్తు అని చెప్పాలి. ఈ సినిమాతో అతడి రేంజే మారిపోయిందన్నది స్పష్టం. ఇంతకుముందు ‘సోలో’.. ‘శ్రీరస్తు శుభమస్తు’ లాంటి విజయాలున్నప్పటికీ వాటికి ‘గీత గోవిందం’ సాధించిన సక్సెస్ కు అసలు పోలికే లేదు.  ఈసారి అతను పెద్ద బడ్జెట్లో భారీ సినిమా ఒకటి తీసే అవకాశాలున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పరశురామ్ కు పెద్ద పెద్ద ఆఫర్లు వస్తున్నట్లు చెబుతున్నారు. 

తన తర్వాతి సినిమా కూడా ‘గీతా ఆర్ట్స్’ బేనర్లోనే  ఉంటుందని పరశురామ్ స్పష్టం చేశాడు. ఈ సినిమా మనిషికి.. దేవుడికి మధ్య నడిచే ఓ కథతో చేయబోతున్నట్లు చెప్పాడు. అలాగని చెప్పి ఇదేమీ ‘గోపాల గోపాల’ తరహాలో ఉండదన్నాడు. తాను చేయబోయేది పూర్తి భిన్నమైన సినిమా అని.. అది ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని.. ఈ కథకు తగ్గట్లు మంచి క్యారెక్టర్లు కుదిరాయని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుందని పరశురామ్ వెల్లడించాడు. ‘గీత గోవిందం’ ఎంత పెద్ద విజయం సాధించినప్పటికీ.. తాను పెద్ద దర్శకుడైపోయినట్లు భావించడం లేదని.. ఈ విజయాన్ని నిలబెట్టుకునే సినిమా తీయడం తన ముందున్న సవాల్ అని అతనన్నాడు.  ‘గీతా ఆర్ట్స్’తో పాటు ‘మైత్రీ మూవీ మేకర్స్’కు కూడా తాను కమిట్మెంట్ ఇచ్చానని.. తర్వాతి సినిమా వాళ్లతోనే ఉంటుందని అతనన్నాడు.