కేసీఆర్‌ చేసిన తప్పుకు...ఆ పార్టీ పుట్టిమునిగేలా వుందట!

16:27 - October 8, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ తెరతీశారు. అసెంబ్లీ రద్దయిన రోజే 105 మంది అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడించారు. ఇక్కడిదాకా బాగానే వుంది. తరువాత కూడా కేసీఆర్‌ దీమాగానే వున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలను చూసి, ఆయన బొమ్మ వుంటే చాలు ప్రజలు ఓట్లేస్తారనుకున్నారు. అదిగో అక్కడే కథ అడ్డం తిరిగింది. కేసీఆర్‌ చేసిన పెద్ద పొరపాటు అదే!. కేసీఆర్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో 30 నుండి 40 మంది అభ్యర్థులపై జనాలు తీవ్ర వ్యతిరేకతతో వున్నారు. ఆ అభ్యర్థులను వద్దంటూ ప్రజలు రోడ్డ మీదకు వస్తున్నారు. ఏకంగా ర్యాలీలు - సభలు నిర్వహిస్తూ టీఆర్ ఎస్ అభ్యర్థులను ఓడిస్తామని తేల్చిచెబుతున్నారు. అంతేకాదు..సీటిచ్చినోళ్లు బాగానే వున్నారు, సీటొస్తదని ఆశ పడి భంగపడిన వాల్లు కూడా ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. దీంతో అటు ప్రజలు, ఇటు అసమ్మతులతో టీఆర్‌ఎస్‌ ప్రమాదంలో పడింది. 

ఈ నేపథ్యంలోనే ...పెద్దపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే టీఆర్ ఎస్ నేత దాసరి మనోహర్ రెడ్డిని సైతం జూలపల్లి మండల వాసులు అడ్డుకున్నారు. అభివృద్ధి చేయలేదని అడ్డుకున్నారు. హుస్నాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ ను ఏకంగా ఆయన జీపును ఆపి మరీ మీరు మా ఊరుకు ఏం చేయలేదంటూ   తెనుగుపల్లి వాసులు నిలదీశారు. ఇక వేములవాడ టీఆర్ ఎస్ అభ్యర్థి రమేష్ బాబును వద్దంటూ అసమ్మతి వాదులు సభలు - సమావేశాలు - నిరసనలు చేస్తున్నారు. ఈయన్ను ఓడిస్తామని ప్రతిన బూనుతున్నారు. ఇక జనగాం - పాలకుర్తి - మానకొండూర్ - రామగుండం  - ఆదిలాబాద్ - నిర్మల్ నియోజకవర్గాల్లోనూ టీఆర్ ఎస్ అభ్యర్థులను ఆయా గ్రామాల వాసులు నిలదీస్తున్నారు. ఇదిలా వుంటే... తాజాగా వరంగల్ పూర్వపు జిల్లాలోని వర్ధన్నపేట టీఆర్ ఎస్ అభ్యర్థి ఆరూరి రమేష్ కు నిరసన సెగ తగిలింది. నాలుగున్నరేళ్లలో మా ఊరుకు ఏం చేశావంటూ బాలాజీ నగర్ వాసులు ఆయన్ను నిలదీశారు. అంతేకాదు ‘గోబ్యాక్’ అనే ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ పెద్దసంఖ్యలో ప్రదర్శనగా ర్యాలీ తీశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.  . దీంతో ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ ఆర్థాంతరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామాలన్నీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌లో అంతర్మథనానికి దారితీస్తున్నాయి. వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చకుండా పొరపాటు చేశామా అన్న ఆందోళన టీఆర్ ఎస్ ముఖ్యనాయకుల్లో వ్యక్తమవుతోందట. దీంతో పాటు.. ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతలు బయటపడి పార్టీ పుట్టిమునిగేలా కనిపిస్తోందంటూ వార్తలొస్తున్నాయి. మరి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ నేపథ్యంలో కేసీఆర్ వీరిని మారుస్తాడా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మార్చకపోతే ఓడిపోయే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి.