కేసీఆర్‌ గుండెల్లో సీట్ల గుబులు...అందుకే ఆ ప్రచారం

16:21 - October 13, 2018

జాతకాలు చూసుకుంటూ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు తెరతీశారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌. అసెంబ్లీ రద్దు చేసినప్పుడు, మొదటి 105 మంది అభ్యర్థుల జాబితా విడుదలప్పుడు రాష్ట్రంలో వాతావరణం కేసీఆర్‌కు అనుకూలంగానే వుందని భావించి సారు పరిగెత్తారు. తరువాత మొదలైంది అసలు సిసలైన సీట్ల సెగ. ఎన్నికలకు రెఢీ అన్న తర్వాత వాతావరణం మారింది. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. దీంతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడటమేకాదు.. కొత్త కొత్త ప్లాన్లను సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా అలాంటి ప్లాన్ ఒకటి కేసీఆర్ సిద్ధం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఇంటికి.. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులను పార్టీకి చెందిన వారు వ్యక్తిగతంగా కలుసుకొని.. వారికి కేసీఆర్ సర్కారు చేసిన పనుల గురించి చెప్పటం.. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలన్న విషయాన్ని వారి వ్యక్తిగతంగా చెప్పేందుకు వీలుగాఒక ప్లాన్ ను సిద్ధం చేశారు. దసరా పండగ తర్వాత మొదలయ్యే ఈ కార్యక్రమం కోసం ప్రతి గ్రామానికి 20 నుంచి 30 మంది వరకూ ప్రత్యేక పరిశీలకుల్ని పార్టీ రంగంలోకి దించుతుంది. వారు నియోజకవర్గం మొత్తాన్ని పర్యటించి.. ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతి ఒటరుకూ కారు గుర్తుకు ఓటు వేయాలని చెబుతారు. పాపం గెలుపుపై ఎంత అనుమానం లేకపోతే ..కేసీఆర్‌ సారు అంత దీమా నుంచి ఇంత ప్రచారానికి వస్తారు?