కూటమి లెక్కలు కొలిక్కి...

12:20 - October 24, 2018

తెలంగాణ ముందస్తు ఎన్నికల వేల కాంగ్రెస్‌తో కలిసి మరికొన్ని పార్టీలు మహాకూటమిని ఏర్పరిచిన విషియం తెలిసిందే. అయితే అందులో సీట్ల లెక్కలు ఒక కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత అనుకున్నట్లుగా వంద స్థానాలు తమ చేతిలో ఉంచుకోవాలన్న కాంగ్రెస్ పట్టు సడలించుకోవటంతో పాటు.. మిత్రులు కోరినట్లుగా గౌరవనీయ స్థానాల్ని కేటాయించేందుకు సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. 100 స్థానాల్లో పోటీని కాస్త కుదించుకొని తొంభైకి పరిమితం కావాలన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మిత్రులకు కేటాయించేందుకు వీలుగా 29 స్థానాల్ని కేటాయించారు. ఇందులో టీడీపీకి 15 స్థానాలు.. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి 10 స్థానాల్లో.. సీపీఐ నాలుగు స్థానాల్లో పోటీకి ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టే పనిలో బిజీగా ఉన్న చంద్రబాబు.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ సహాయ సహకారాలు భారీగా అవసరమైన నేపథ్యంలో.. కాంగ్రెస్కు నమ్మకమైన మిత్రుడిగా వ్యవహరించాలని.. ఆ పార్టీని అనవసరమైన చికాకులు పెట్టకూడదని.. చిన్న విషయాలకు లొల్లి చేసే ధోరణిని ప్రదర్శించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థాగతంగా ఏ మాత్రం లేని తెలంగాణ జన సమితికి పది స్థానాలు ఇస్తుంటే.. టీడీపీ 15 స్థానాలకు పరిమితం కావటం వెనుక వ్యూహం ఇదేనని చెబుతున్నారు.  అనధికారికంగా బయటకు వచ్చిన ఈ లెక్కల్లో నిజం ఎంతన్నది ఈ నెలాఖరు లోపే తేలుతుందంటున్నారు.