కూటమికి బీసీల దెబ్బ!

10:52 - November 15, 2018

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల వారూ అభ్యర్థుల ప్రకటన, ప్రచారాల్లో మునిగితేలుతున్నారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం, సిపిఐ, టీజేఎస్‌ కలిసి కూటమి ఏర్పాటు చేసి ఈ ఎన్నికల్లో పోటీ  చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమికి బీసీలతో ఎదురుదెబ్బ తప్పదట!. ఎందుకంటే... టిక్కెట్ల పంపిణీ వరకు కాసింత అనుకూలంగా ఉన్నట్లు కనిపించినా అభ్యర్దుల ప్రకటన తర్వాత ఆ ఊపిరి కూడా పోయే పరిస్దితి కనపడుతోంది. ముఖ్యంగా బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీని బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికలలో మలక్పేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్దిగా గెలిచిన బీసీ నేత ఆర్. క్రిష్ణయ్య సైకిల్ దిగిపోయారు. ఆయన పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి మంచి దన్ను ఉండేది. ఇప్పుడు ఆ బలం పోయింది. ఆయనతో పాటు ఇతర బీసీ సంఘాల నేతలు కూడా తెలుగుదేశం పార్టీ పట్ల కన్నెర్రజేస్తున్నారు. మహాకూటమి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూటమిలో పెద్దన్నగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా బీసీలు మండిపడుతున్నారు. బీసీలకు కెటాయించాల్సిన స్దానాలు తక్కువ చేసారని - సీనీయర్ నాయకులకు సైతం టిక్కట్లు ఇవ్వకుండా అవమానించారని బీసీల ఆవేదన. టిక్కెట్ల పంపిణీలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఏకంగా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడు ఇలాంటి ఐక్యమత్య సంఘటన జరగలేదని - ఈ ఎన్నికలతో బీసీ కులాలు ఒక్కటవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శనివారం నాటి బంద్ విజయవంతమైతే ఇటు తెలంగాణలోను - అటు ఆంధ్రప్రదేశ్ లోను కూడా బీసీ కులాలు ఒక్కటై తమ డిమాండ్లు సాధించుకుంటారని అంచన. ఇదే జరిగితే బీసీల కారణంగా తొలి దెబ్బ తగిలేది మహాకూటిమికేనని విశ్లేషిస్తున్నారు.