కుత్బుల్లాపూర్‌ సమగ్రాభివృద్ధి బీఎల్‌ఎఫ్‌తోనే సాధ్యం

13:01 - November 27, 2018

కుత్బుల్లాపూర్‌ సమగ్రాభివృద్ధి బీఎల్‌ఎఫ్‌తోనే సాధ్యమవుతుందని ఆ ఫ్రంట్‌ బలపరిచిన బీఎల్‌పీ అభ్యర్థి బొడిగె లింగస్వామి తెలిపారు. సూరారం డివిజన్‌ పరిధి గాంధీ నగర్‌లో లింగస్వామి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు టీఆర్‌ఎస్‌ పాలనలో అణచివేయబడ్డాయని ఆరోపించారు. అంతేకాదు కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో బహుజనులకు తీరని అన్యాయం జరిగిందని తెలియజేశారు. రాజీవ్‌ గాంధీ నగర్‌లో ఇప్పటి వరకూ రోడ్లు సరిగ్గా లేవని, డ్రైనేజీ, తాగునీటి సమస్యలున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ మాటలు కోటలు దాటిస్తుంది కానీ చేతలు మాత్రం ఏమీలేవని ఆయన అన్నారు. ఇండ్ల పట్టాల పంపిణీ నీరుగారిందని, విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో లేకుండా ప్రయివేటు కార్పోరేట్ల పరం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే...సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.