కుక్కకు క్షమాపన చెప్పలేదని...చంపేశారు

10:35 - October 8, 2018

ప్రస్తుత సమాజంలో మనుషులు ఎక్కడుంటున్నారో?, ఎలా ప్రవర్తిస్తున్నారో? అనే విచక్షణా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారనటానికి ఇదొక ఉదాహరణ.
కుక్కకు క్షమాపణ చెప్పలేదని నిర్ధాక్షణంగా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. అవునండీ..ఇది పచ్చి నిజం. వివరాల్లోకి వెళ్లితే.. తమ కుక్కకు క్షమాపణ చెప్పనందుకు ఓ వ్యక్తిని దారుణంగా పొడిచి చంపిన ఘటన ఢిల్లీలో సంచలనంగా మారింది. స్థానిక ఉత్తమ్‌నగర్‌ ప్రాంతంలో అంకిత్‌, పరాస్‌, దేవ్‌ చోప్రా అనే ముగ్గురు ఆదివారం సాయంత్రం తమ పెంపుడు కుక్కతో కలిసి వ్యాహ్యాళికి వచ్చారు. పొరుగున ఉండే విజేందర్‌ రాణా అనే ట్రక్కు డ్రైవర్‌ వేగంగా తన వాహనంతో వారి పక్కగా వెళ్లాడు. ఆ వేగానికి భయపడిన కుక్క, ట్రక్కును చూసి మొరిగింది. అక్కడ జరిగింది ఇంతే కానీ...విచక్షణ కోల్పోయిన ఆ ముగ్గురూ ఏం చేశారో తెలుసా?...తమ కుక్కకు క్షమాపణ చెప్పిన తర్వాతే ముందుకు వెళ్లాలని రాణాకు ముగ్గురూ హుకుం జారీ చేశారు. అందుకు నిరాకరించడంతో.. ముగ్గురూ కలిసి స్ర్కూడ్రైవర్లు, కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. అక్కడికి చేరుకున్న రాణా సోదరుడు రాజేష్‌ను కూడా పొడిచారు. రాణా అక్కడికక్కడే మరణించగా.. రాజేష్‌ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.