కాంతివంతమైన ముఖం కావాలంటే...

17:11 - August 23, 2018

వాతావరణంలో కలిగే మార్పులు...చర్మంపై ప్రభావం చూపుతాయి. అవి ముఖ చర్మాన్ని కాంతిహీనంగా మారుస్తాయి. సహజమైన పద్ధతిలో ముఖం కాంతివంతంగా మెరవాలంటే... ఇవి ప్రయత్నించి చూడండి... 

-  రోజూ ఉదయాన్నే కలబంద గుజ్జును తీసి ముఖంపై పట్టించి రుద్దాలి. 20 నిమిషాల తర్వాత వేడి నీటి స్నానం చేయటం వల్ల ముఖ చర్మం బిగుతుగా తయారై పెద్దవైన చర్మరంధ్రాలు దగ్గరకు వచ్చి చర్మం నునుపు అవుతుంది. 

- తేనె, నిమ్మరసం, కొద్దిగా చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఆ మిశ్రమం ఆరిపోయాక ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. 

- బాదం పప్పులను మెత్తగా నూరి ముఖానికి అంతా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. 

- రోజ్‌వాటర్‌తో ముఖం తరచుగా శుభ్రపరచటం వల్ల చర్మంపై ఉండే సూక్ష్మరంధ్రాలు పరిశుభ్రంగా తయారవుతాయి.

- ఒక బౌల్‌లో టొమాటో రసం, నిమ్మరసం, పాలు, కొద్దిగా నూనె కలిపి ముఖానికి పట్టిస్తుంటే ముఖచర్మం అందంగా తయారవటమే కాదు మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

- నీటిలో కీరదోస రసం గాని, ఆపిల్‌ రసం గాని, గ్రీన్‌ టీ గాని కలిపి ఫ్రిజ్‌లో ఐస్‌గా చేసి గుడ్డను మూటకట్టి ముఖంపైన కొద్దిసేపు ఉంచి కడిగేయాలి. ఇలా రెండు, మూడు సార్లు చేస్తే చర్మం అందంగా తయారవుతుంది. చూడగానే ముఖ చర్మం నున్నగా కనపడుతుంది.

- అందమైన ముఖచర్మం కోసం పెరుగు బాగా ఉపయోగపడుతుంది. ముఖానికి పెరుగు పట్టిస్తే అందులో ఉండే లాక్టిక్‌ ఆసిడ్‌ చర్మరంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఆయిల్‌ ఫేస్‌లో ఉండే జిడ్డును పెరుగు పోగొడుతుంది. ముఖంపై తేనెను రాస్తే చక్కని ఫలితం ఉంటుంది.