కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఎల్‌ఎఫ్‌

11:34 - November 15, 2018

కాంగ్రెస్ - టీడీపీ - సీపీఐ కలిసి ఏర్పడిన మహాకూటమి ఇంకా సీట్ల పంపకం దశలోనే ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి - రెండో జాబితా అంటూ ఓ వైపు ప్రకటనల పర్వంలో ఉంటూనే మరోవైపు మిత్రపక్షాల్లోని పార్టీలు తమ పార్టీకి చెందిన నేతలకు తగు ప్రాధాన్యం దక్కడం లేదని సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ ఎపిసోడ్ పై ఆసక్తికర రీతిలో స్పందించారు. మహాకూటమిని బేస్ లెస్ ఆలోచనగా కొట్టిపారేశారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై తమ్మినేని వీరభద్రం మాట్లాడుతు...ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న తరుణంలో మళ్లీ కాంగ్రెస్ కు వంత పలకటం మూర్ఖత్వం అని వ్యాఖ్యానించారు. దేశంలో కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలను తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని.. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్తో కలవటానికి తాము సిద్ధంగా లేమన్నారు. కాంగ్రెస్ - టీఆర్ ఎస్ - బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ ఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయం - చట్ట సభల్లో బలహీనులకు అవకాశం కల్పించటమే తమ లక్ష్యమన్నారు. బీఎల్ ఎఫ్ తోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తమది మొదటిది లేదా మూడో ఫ్రంట్ అనికూడా  అనుకోవచ్చునని తమ్మినేని తెలిపారు. కేసీఆర్ స్వలాభం కోసమే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని..ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. తమ ఫ్రంట్ కు ప్రజల మద్దతు ఉనంటున్నారు.