కాంగ్రెస్‌లోకి చేరేదిలేదంటున్న గద్దర్‌

10:06 - October 29, 2018

కాంగ్రె్‌సలో చేరబోనని, అయితే లౌకికవాద పరిరక్షణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఆ పార్టీకి మద్దతు ఇస్తానని ప్రజా గాయకుడు గద్దర్‌ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలన్నీ తన అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే కేసీఆర్‌పై పోటీ చేస్తానని మీడియా ద్వారా తెలియజేశానని, దీనిపై ఇంతవరకు ఏ పార్టీ స్పందించలేదని తెలిపారు. తన లక్ష్యాన్ని తెలియజేసేందుకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులను కలిశానని వివరించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిసి ఆయనను కూడా కలిశానని తెలిపారు. దేశాన్ని,రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో గత రెండేళ్లుగా పని చేస్తున్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా తన పాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రచారం చేస్తున్నానని వివరించారు.  '' దాదాపు లక్షా 50వేల కిలో మీటర్ల దూరం ప్రయాణించాను. నా పాటలు, ప్రసంగాలతో ప్రజల్లో కదలిక తెచ్చాను '' అని చెప్పారు. ఒక వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ సర్కారు మనువాద సిద్ధాంతం ఆధారంగా భూస్వామ్య, కుల వ్యవస్థలోకి జారిపోతున్నాయని విమర్శించారు. దేశ ప్రజల ప్రజాస్వామిక హక్కులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.