కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న చిరు...

14:41 - November 10, 2018

కాంగ్రెస్‌ పార్టీకి చిరంజీవి గుడ్‌బై చెప్పనున్నారట!. సిద్ధాంతాలను తుంగలో తొక్కి మరీ పొత్తు పెట్టుకున్న టీడీపీ- కాంగ్రెస్ ల తీరును నిరసిస్తూ ఆయన హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేయనున్నారా?  కొద్దికాలంగా పార్టీకి అంటీముట్టనున్న మెగాస్టార్...త్వరలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాజకీయంగా బద్దశత్రువు అయిన టీడీపీతో కాంగ్రెస్ పార్టీ కలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా  మారిన సంగతి తెలిసిందే. అనేక మంది కాంగ్రెస్ సీనియర్లు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతూ పదవులు వీడుతున్నారు. మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్ - బాలరాజు - మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య ఈ జాబితాలో ఉన్నారు. వీరిలాగే అసంతృప్తిలో ఉన్న చిరంజీవి టీడీపీ- కాంగ్రెస్ ల అనైతిక పొత్తుతో తీవ్రంగా మథనపడుతున్నట్లు సమాచారం. అందుకే త్వరలో పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ నెలలోనే చిరంజీవి స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం. కాగా చిరంజీవి గుడ్ బై చెబితే కాంగ్రెస్ పార్టీకి నష్టం ఖాయమంటున్నారు. చిరంజీవి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేయడమే కాకుండా - సోదరుడి పార్టీ కోసం తెరమీదకు వస్తారని పలువురు విశ్లేషిస్తున్నారు. సినీ రంగంలో సత్తా చాటుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికలను ఎదుర్కొన్నారు. అయితే కేవలం 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పార్టీ పరిమితం అయ్యింది. 2011 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం 2012 ఏప్రిల్ 3న రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పర్యాటక శాఖ  బాధ్యతలు నిర్వహించారు. అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడటంతో...చిరంజీవి మంత్రి పదవి కూడా పోయింది.