ఒక్క క్లిక్‌ కోసం ప్రాణాలతో రిస్క్‌...

17:12 - November 10, 2018

ఢిల్లీలో ఈ నెల 4న ప్రారంభమైన సిగ్నేచర్ బ్రిడ్జి వద్ద ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. ప్రతిష్ఠాత్మకంగా యమునా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.1500 కోట్లు ఖర్చు చేశారు. ట్రాఫిక్ సమస్యను తీర్చడమే లక్ష్యంగా నిర్మించిన ఈ బ్రిడ్జిని అంతే సుందరంగా నిర్మించారు. సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ బ్రిడ్జిపై 505 అడుగుల ఎత్తులో నిర్మించిన వంతెన శిఖరం వద్దకు వెళ్లి ఢిల్లీ అందాలను వీక్షించే వీలుంది. ఇందుకోసం ఒకేసారి 50 మంది పట్టేలా బ్రిడ్జి శిఖరంపై అద్దాల గదిని ఏర్పాటు చేశారు. ఇప్పుడీ బ్రిడ్జి వద్ద యువకులు ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ హోరెత్తిస్తున్నారు. సెల్ఫీ పిచ్చి యువతలో ఎంతగా పెరిగిపోయిందో చెప్పేందుకు ఇదో చక్కని ఉదాహరణ. ఒక్క ' క్లిక్ ' కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేస్తున్నారు. అవి చూస్తున్న వారి ఒళ్లు గగుర్పొడుస్తోంది. కారులో వేగంగా వెళ్తూ విండోపై కూర్చుని సెల్ఫీలు దిగుతూ హంగామా సృష్టించారు. ఇంకొందరు అక్కడి సెల్పీ స్పాట్‌లపైకి ఎక్కి మరీ హంగామా చేశారు.