ఐపీఎల్‌ వేలంలో ఈసారి యువరాజ్‌ను కొంటారా?

11:23 - December 18, 2018

క్రికెటర్లపై కనకవర్షం కురిపించే ఐపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 10003 మంది క్రికెటర్లు వేలంలో పాల్గొనడానికి ధరఖాస్తు చేసుకోగా.. ప్రాంచైజీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని 350 మందితో కూడిన తుది జాబితాను ఐపీఎల్‌ పాలకమండలి ఆమోదించింది. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లకు చోటు దక్కగా.. మిగిలిన వారు విదేశీ క్రికెటర్లు. వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఆటగాళ్ల కోసం వేలం జైపూర్‌లో మంగళవారం జరగనుంది. అయితే భారత క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. యువీని ఈసారి వేలంలో ఎవరైనా కొంటారా.. లేదా? అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఐపీఎల్‌లో ఒకానొక సమయంలో గరిష్ఠంగా రూ.16 కోట్లు పలికిన యువీ.. తాజా వేలంలో కనీస ధర రూ. కోటికి పడిపోయాడు. నిరుడు ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున యువరాజ్‌ 8 మ్యాచ్‌ల్లో 65 పరుగులే చేశాడు. దీంతో ఆ జట్టు యువీని వదులుకుంది. ఇక, కోటి రూపాయల కనీస ధరలో యువీతో పాటు పేసర్‌ షమి, వికెట్‌కీపర్‌ సాహా, స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ ఉన్నారు. వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ ఖాతాలో అత్యధికంగా రూ.36.20 కోట్లు ఉండగా.. అత్యల్పంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ వద్ద రూ.8.40  కోట్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 25.50  కోట్లు, రాజస్థాన్‌ రాయల్స్‌కు రూ. 20.95 కోట్లు, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు రూ. 18.15 కోట్లు, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు రూ. 15.20 కోట్లు, ముంబై ఇండియన్స్‌కు రూ.11.15  కోట్లు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు రూ.9.70  కోట్లు వేలంలో ఖర్చు చేసేందుకు అవకాశముంది.