ఐఐటీ మద్రాసులో మూడు రకాల అంటరానితనం

11:02 - December 15, 2018

ప్రఖ్యాత ఐఐటీ మద్రాసు క్యాంటీన్‌లో శాకాహార, మాంసాహార ప్రియులకు వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయడం వివాదం సృష్టించింది. క్యాంటీన్‌లో మాంసాహారులు, అత్యంత శాకాహారులు, శాకాహారులంటూ మూడు రకాల అంటరానితనం పాటిస్తున్నారంటూ కొందరు విద్యార్థులు ఆరోపించడం కలకలం రేపింది. శాకాహారులకు ప్రత్యేక ప్లేట్లు, ఇతర పాత్రలు వాడుతున్నారు. మాంసాహారాలకు ప్రత్యేక వంటపాత్రలు ఉపయోగిస్తున్నారు. ఈ మూడురకాల భోజన ప్రియులు క్యాంటీన్‌లో వేర్వేరు స్థలాల్లో భోజనం చేస్తున్నారు. క్యాంటీన్‌లో వడ్డింపులలో మూడు రకాల వడ్డింపులు ఎందుకు పాటిస్తున్నారో అర్థం కావటం లేదని విద్యార్థులు చెప్పారు. ఇక సామాజిక ప్రసార మాధ్యమాల్లో వెలువడిన ఫొటోలు తాజాగా తీసినవేనని కూడా తెలిపారు. దీనికి సాక్ష్యంగా కొన్ని ఫొటోలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫొటోలను పెరియార్‌ పాఠకుల సంఘం నిర్వాహకులు వెలువరించారు. శాకాహారం, మాంసాహారం సరే! అత్యంత(ప్యూర్‌ వెజిటేరియన్‌) శాకాహారమంటే ఏమిటో తెలియక పలువురు తలలు పట్టుకుంటున్నారు. ప్యూర్‌ వెజిటేరియన్లకు అందించే ఆహార పదార్థాల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు వాడటం లేదు. ఇదంతా కూడా విద్యా సంస్థ యాజమాన్యం అంగీకారంతోనే ఈ ఆచారం పాటిస్తున్నారని విద్యార్థులు చెప్పారు.