' ఏ ముఖం పెట్టుకొని వచ్చారు? ' అంటూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను నిలదీస్తున్న గ్రామస్థులు

10:33 - November 24, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు ఈ నెల 19తో నామినేషన్లు వేయడం కూడ పూర్తయింది. ఇక వచ్చే నెల 7వ తేదీన జరగబోయే ఎన్నికలకు పార్టీల అభ్యర్థులు ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఎవరి రూటులో వారు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాత్రం పోయిన ప్రతి చోటా కూడా గోరమైన అవమానాలను ఎదుర్కొంటున్నారు. గడిచిన ఈ నాలుగేండ్లలో మీరు మాకు చేసింది ఏంటి? అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. తాజాగా.... తాజాగా...టీఆర్ఎస్ అశ్వారావుపేట అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు అటువంటి అనుభవమే ఎదురైంది. తమ గ్రామానికి వచ్చిన ఆయనను చూడగానే గ్రామస్థులు చెప్పులు, రాళ్లతో ఆయనకు స్వాగతం పలికారు. ఆయనపై రాళ్లు రువ్వారు. చెప్పులు విసిరారు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలంలోని  పోకలగూడెంలో జరిగిందీ.  వెంకటేశ్వర్లు శుక్రవారం  శ్రీరాంపురం, రేపల్లెవాడ గ్రామాల మీదుగా అన్నారం తండా, గానుగపాడు నుంచి పోకలగూడేనికి చేరుకున్నారు. గ్రామానికి ఆయన చేరుకోగానే స్థానికులు పెద్ద ఎత్తున ఆయనను చుట్టుముట్టారు. లంబాడాలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారంటూ నిలదీశారు. తమ గ్రామానికి ఈ నాలుగేళ్లలో ఏం చేశారని మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చారని నిలదీశారు. ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ చెప్పులు, రాళ్లు విసిరారు. అయితే, పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.