ఎప్పుడైనా కాల్చుకోండి...సమయం మాత్రం రెండు గంటలే!

10:24 - October 31, 2018

ఏ సమయంలో పటాకులు కాల్చుకుంటే బాగుంటుందో మీరే నిర్ణయించుకోండని తమిళనాడు, పాండిచ్చేరి సహా దక్షిణాది రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది. కానీ రెండు గంటల పాటు మాత్రమే కాల్చాలని  సుప్రీం తేల్చిచెప్పింది. దీపావళి సందర్భంగా పటాకులను కేవలం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని ఇటీవల తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు.. మంగళవారం దానిని కాస్త సవరించింది. దీపావళి పర్వదినాన రాత్రి 8  నుంచి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చాలన్న సుప్రీంకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. తమిళనాట దీపావళి రోజు వేకువ జామున పటాకులు కాల్చే ఆనవాయితీ ఉందని.. దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకొంటారని.. దానిని పరిగణనలోకి తీసుకుని ఉదయం గంటన్నర పాటు, సాయంత్రం మరో గంటన్నర పాటు టపాసులు కాల్చుకునేందుకు తమకు అనుమతివ్వాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే రెండు గంటలకు మించి కాల్చేందుకు అనుమతించేది లేదని, అవసరమైతే ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట కాల్చుకోవాలని ధర్మాసనం సూచించింది. ఆ రెండు గంటలు ఎప్పుడన్నది నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తున్నామని తెలిపింది. కాలుష్యరహితంగా హరిత దీపావళిని జరుపుకోవాలని నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం.. పటాకుల ఉత్పత్తిదారులకు కూడా కాస్త వెసులుబాటు ఇచ్చింది. ఈ ఆదేశం దేశరాజధాని ప్రాంతానికే పరిమితమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి బుధవారం ఆదేశాలిస్తామని తెలిపింది. ఇప్పటికిప్పుడు పర్యావరణహిత పటాకుల తయారీ తమకు సాధ్యం కాదని పటాకుల ఉత్పత్తిదారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో హరిత దీపావళి జరుపుకోవాలనడం.. పటాకులపై నిషేధం విధించడంతో సమానమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూలైలో మాత్రమే హరిత పటాకులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.