ఎన్నికల వేల టీఆర్‌ఎస్‌కు షాక్‌...

11:13 - December 3, 2018

ఓల్డ్‌బోయినపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు ఆరుగురు ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో మైనార్టీ సెల్‌ నాయకుడు ఎండీ ఖాదర్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ విభాగం బాధ్యుడు వల్లభ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మాజీ జనరల్‌ సెక్రెటరీ పంజాల ఆంజనేయులు గౌడ్‌, జాగృతి కన్వీనర్‌ కూచన ఈశ్వర్‌ నేత, అంజయ్యనగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడుసీహెచ్‌ పోచయ్య ఉన్నారు. డివిజన్‌ పరిధిలోని హస్మత్‌పేట్‌ కార్యాలయంలో ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కూతాడి రవీందర్‌ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాను మోసిన తమకు పార్టీలో ఆదరణ కరువైందన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా, తమపై ఆరోపణలు చేశారన్నారు. ఈ విషయంపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణారావుకు వివరించే ప్రయత్నం చేసినా పట్టించుకోకపోవడం కలిచి వేసిందని పేర్కొన్నారు. పార్టీ జెండా మోయని కొందరు వచ్చి పదవులు అనుభవిస్తుంటే, దశాబ్ద కాలం నుంచి తాము కార్యకర్తలు గానే మిగిలిపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో...పార్టీ కార్యాలయంలో ఉన్న కేసీఆర్‌, కృష్ణారావు ఫ్లెక్ల్సీలను తొలగించి టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. కాగా, టీఆర్‌ఎస్‌ పార్టీలో స్థానికంగా అంతర్గత విభేదాలున్నాయన్న ఆరోపణలుండగా, తాజా రాజీనామాలతో ఆ చర్చ ఎక్కువైంది. రాజీనామా బాటలో మరికొందరు నేతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.