ఎన్నికల బరిలో ప్రముఖుల వారసులు

10:27 - September 20, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌ తెరలేపారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు పోత్తులతో మహాకూటమి ఏర్పడింది. దీనిలో టీడీపీ, టీజేఎస్‌, కాంగ్రెస్‌లు కలిసి ఈ ఎన్నికల బరిలో దిగనున్నాయి. అయితే టీడీపీ, టీజేఎస్‌ నుంచి ఎన్టీఆర్‌, చెన్నారెడ్డి మనుమళ్లు ఈ బరిలో దిగనున్నారు. ఎన్టీఆర్‌ మనుమడు, దివంగత నేత నందమూరి హరికృష్ణ తనయుడు, సినీహీరో కల్యాణ్‌రామ్‌ను మహాకూటమి తరఫున శేరిలింగంపల్లి లేదా కూకట్‌పల్లి నుంచి బరిలో దింపేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌తో పొత్తుల సందర్భంగా టీడీపీ నేతలు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి శాసనసభ స్థానాలు కేటాయించాలని కోరారు. కాంగ్రెస్‌ నేతలు కూడా కల్యాణ్‌రామ్‌ను బరిలో దించే ఆలోచనను స్వాగతిస్తున్నారు. ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి ఎవరైనా పోటీచేస్తే ఆ సీటు వదులుకోవడానికి సిద్ధమేనని అంగీకరించినట్లు తెలిసింది. ఇటీవలే హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ కుటుంబం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని టీడీపీ నాయకత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.

మాజీ సీఎం, దివంగత నేత చెన్నారెడ్డి మనవడు, మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి తనయుడు ఆదిత్యరెడ్డి తెలంగాణ జనసమితి నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. ఆయన ఇటీవలే టీజేఎస్‌లో చేరారు. మంత్రి మహేందర్‌రెడ్డిపై బరిలో దింపాలని మహాకూటమి నిర్ణయించినట్లు సమాచారం. చెన్నారెడ్డి రాజకీయ జీవితం తాండూరు నుంచే మొదలైంది. అదే సెంటిమెంటుతో ఆదిత్యరెడ్డిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.