ఎన్నికల్లో వాడేదంతా బ్లాక్‌మనీనే..నోట్లరద్దు ప్రభావం ఏం లేదు: రావత్‌

13:45 - December 3, 2018

డీమానిటైజేషన్ తర్వాత ఎన్నికల్లో నల్లధనం వినియోగం తగ్గుముఖం పడుతుందని భావించారని... కానీ ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పట్టుబడుతున్న నల్లధనాన్ని చూస్తే... నోట్ల రద్దు ప్రభావం లేదని అనిపిస్తోందని  మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నోట్ల రద్దు ఎన్నికల్లో నల్లధన ప్రవాహంపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని ఆయన అన్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో మరింత ఎక్కువ ధనం పట్టుబడిందని తెలిపారు. ఎన్నికల్లో వినియోగిస్తున్న నల్లధనంపై నిఘా లేదని తెలిపారు. రాజకీయ నేతలు, వారికి ఆర్థిక సహకారం అందిస్తున్నవారికి డబ్బు లోటు లేదని అన్నారు. ఎన్నికల సందర్భంగా వినియోగిస్తున్న భారీ సొమ్మంతా ముమ్మాటికీ బ్లాక్ మనీనే అని చెప్పారు. రాజకీయ పార్టీలు తీసుకునే విరాళాలలో పారదర్శకతను తీసుకురావడానికి చాలా కాలం పడుతుందని రావత్ అభిప్రాయపడ్డారు. పార్టీ ఖర్చులపై ఒక సీలింగ్ ఉండాలనే విషయంపై ఆగస్టులో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించామని...  సీలింగ్ కు సంబంధించి అన్ని పార్టీలు తమ అంగీకారాన్ని తెలిపాయని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చలపైనే ప్రస్తుతం సీలింగ్ ఉందని... ఇదే సమయంలో రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చుపై సీలింగ్ లేదని అన్నారు.గత వారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా రావత్ రిటైర్ అయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఒక పని చేయలేకపోయినందుకు చింతిస్తున్నానని ఆయన అన్నారు. ఎన్నికల్లో డబ్బు వినియోగం, సోషల్ మీడియా వినియోగంపై కేంద్ర న్యాయశాఖకు రెకమెండేషన్లు ఇవ్వలేకపోయానని చెప్పారు.