ఎన్నికల్లో ..నకిలీనోట్లు!

12:10 - October 15, 2018

డిశంబర్‌ నెలలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషియం తెలిసిందే. అయితే ఓటర్లకు డబ్బులు పంపే కార్యక్రమంలో నకిలీ నోట్లను ముద్రిస్తున్నారంట!. అవునండీ మీరిన్నది నిజమే..ఇది మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు కోట్లరూపాయల నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన ఘటన భోపాల్ నగరంలో వెలుగుచూసింది. భోపాల్ నగరంలోని రాజ్ ఘడ్, హోషానాబాద్ ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి రూ.31.5లక్షల నకిలీ రెండువేలు, 500రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ఎన్నికల్లో ఓటర్లకు ఇచ్చేందుకే మూడుకోట్ల రూపాయల నకిలీనోట్లను ముద్రించాలని ఆర్డరు ఇచ్చారని పోలీసుల ఇంటరాగేషన్ లో నిందితులు చెప్పారు. నకిలీనోట్ల ముద్రణ బాగోతంలో మధ్యప్రదేశ్ హాకీ మాజీ క్రీడాకారుడు ఆఫ్తాబ్ అలీ (42)అలియాస్ ముస్తాఖ్ ఖాన్ కీలకవ్యక్తి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆఫ్తాబ్ అలీతోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అసలు కరెన్సీనోటును స్కానింగ్ చేసి నకిలీనోట్లను ముద్రించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నకిలీనోట్ల బాగోతంలో అసలు వ్యక్తికోసం దర్యాప్తు సాగిస్తున్నారు.