ఎన్టీఆర్‌: వారిద్దరి మద్య స్నేహాన్నే చూపిస్తారట...!

13:00 - September 21, 2018

 తెలుగువారైన ప్రతిఒక్కరి గుండెలోనూ చిరస్థాయిగా నిలిచేపోయే వ్యక్తి నందమూరి తారక రామారావు . అయితే ఇప్పుడు ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నారు.   నందమూరి తారక రామారావు జీవితంలో పాజిటివ్ అంశాలతో పాటు ఎన్నో వివాదాలు కూడా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న ' ఎన్టీఆర్‌ బయోపిక్‌ 'లో  కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే చూపిస్తున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న వివాదం కూడా లేకుండా సినిమాను తీయాలని క్రిష్ భావిస్తున్నాడు. అందుకోసం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్ను పోటు ఎపిసోడ్ ను చిత్రంలో లేకుండా ప్లాన్ చేసిన క్రిష్ తాజాగా ఎన్టీఆర్ - ఏయన్నార్ ల వివాదం కూడా చూపించడం లేదని సమాచారం అందుతుంది. 

ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లు తెలుగు సినిమా పరిశ్రమలకు మూల స్థంబాలాంటివారు, అంతేకాదు వీరు మంచి స్నేహితులు. అయితే వీరిద్దరు ప్రొఫెషనల్ గా మాత్రం పోటీ పడేవారట. ఇక వీరిద్దరి అభిమానులు అప్పట్లో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉండేవారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు ఏ స్థాయిలో ఫ్యాన్స్ గొడవ పడుతున్నారో అప్పట్లో ఎన్టీఆర్ మరియు ఏయన్నార్ అభిమానులు కూడా పోటా పోటీగా ప్లెక్సీలు పెట్టడం - గోడ రాతలు రాయడం చేసేవారట. ఎన్టీఆర్ మరియు ఏయన్నార్ లు కలిసి పలు చిత్రాల్లో నటించినా కూడా ఇద్దరి మద్య పోటీ తత్వం మాత్రం అలాగే ఉండేది. ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత ఇద్దరి మద్య గ్యాప్ మరింతగా పెరిగిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.  తాజాగా ఏయన్నార్ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ఎన్టీఆర్ నోట్లో ఉన్న సిగరెట్ ను ఏయన్నార్ వెలిగిస్తున్న ఈ పోస్టర్ ఇద్దరి మద్య స్నేహంకు ప్రతి రూపంగా నిలుస్తుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. బాలకృష్ణ మరియు సుమంత్ లు అచ్చు గుద్దినట్లుగా ఎన్టీఆర్ మరియు ఏయన్నార్ లను దించేశారు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.