ఉనికి లేనికాడ అధికారంలోకి ఎలా వస్తుంది స్వామీ?

15:17 - November 27, 2018

సన్యాసులుగా మారి.. స్వామీజీల అవతారం ఎత్తిన వాళ్లు సున్నితంగా ఉంటారు.  భాష విషయంలో చాలా జాగ్రత్త పడతారు. అందులోనూ జనాల్లోకి వచ్చినపుడు మరింత జాగ్రత్త పడతారు. కానీ ఈ మధ్య ఆధ్యాత్మిక కార్యకలాపాల కంటే రాజకీయాల్లో చాలా బిజీగా కనిపిస్తున్న స్వామి పరిపూర్ణానంద మాత్రం తాను ఒక స్వామీజీననే విషయాన్నే మరిచిపోతున్నట్లున్నారు.  ఆయన మరిచిపోతే వచ్చిన నష్టం ఏమీ వుండదు. కానీ తెలంగాణలో పరిస్థితి ఎలా వుందో కూడా తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరిపూర్ణానంద స్వామి బీజేపీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ ఉనికి కోసం పార్టీ ముప్పతిప్పలు పడుతుంటే...ఈ స్వామీజీ మాత్రం బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. స్వామీ నువ్వు చెప్పే మాటలు మూఢనమ్మకాలను నమ్మే వారు నమ్ముతారేమో కానీ సామాన్య ప్రజలు నమ్మరు. మలక్ పేట బీజేపీ అభ్యర్థి ఆలె జితేంద్రకు మద్దతుగా మూసారాంబాగ్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా మోడీ పట్ల వ్యతిరేకత పెరుగుతూ.. దక్షిణాదిన అది తీవ్ర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఆయనపై పరిపూర్ణానంద ప్రశంసలు కురిపించేశారు. స్వామీ మోడీ భజన చేయాలంటే మీ ఆశ్రమాల్లో చేసుకోండి. అంతేకానీ ఇలా జనాల మధ్యలో చేస్తే ప్రజలు ఊరుకోరు అంటూ కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.