ఉద్యోగులకు శుభవార్త

11:30 - December 12, 2018

రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీపికబురు అందించింది. ఎస్‌బీఐ శాఖల ద్వారా జీతాలు పొందుతున్న ఉద్యోగులందరీ ఖాతాలను స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీ (ఎస్‌జీఎస్‌పీగా)గా పరిగణించనుంది. ఇప్పుడు వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఈ ప్యాకేజీకి మారితే అనేక ప్రయోజనాలు పొందనున్నారు. ఈ ఖాతా మార్పునకు సంబంధించి ఎస్‌బీఐ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీనివల్ల ఇతర ఖాతాదారులకంటే మెరుగైన సేవలు, రాయితీలు, ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ అవకాశం కేవలం రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే కాకుండా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యో గులకు కూడా అమలు కానుండడం విశేషం. అకౌంట్‌ మార్చుకునేందుకు కావల్సినవి ఏంటంటే...సేవింగ్‌ అకౌంట్‌ను రెగ్యులర్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయి శాలరీ అకౌంట్‌గా మార్పుచేసుకునేందుకు ఉద్యోగి ఐడీ, పాన్‌కార్డు జెరాక్స్‌లతోపాటు రీసెంట్‌ జీతం బిల్లు, ఆధార్‌ కార్డులతో బ్యాంకు వారిచ్చిన అప్లికేషన్‌ పూర్తిచేసి సదరు ఉద్యోగి సంతకాలతో కూడిన సెట్‌ను ఎస్‌బీఐ బ్రాంచ్‌లలో సమర్పించాలి. బ్యాంకు అధికారులే రెండు, మూడు రోజుల్లో సంబంధిత ఖాతాదారుని అకౌంట్‌ ఎస్‌జీఎస్‌పీ అకౌంట్‌గా మార్పుచేస్తారు. ఆన్‌లైన్‌ అకౌంట్‌ఉన్న ఉద్యోగికి సదరు అకౌంట్‌ స్టేటస్‌ రిపోర్టు మెసేజ్‌ రూపంలో వస్తుంది. ఉద్యోగి పొందే వేతనం ఆధారంగా వివిధ పేర్లతో ఎస్‌జీఎస్‌పీ అకౌంట్‌ కేటాయిస్తారు.  5 నుంచి 20 వేల రూపాయల వరకు వేతనం తీసుకునే వారికి సిల్వర్‌ కార్డులు, 20 నుంచి 50 వేల జీతం తీసుకున్నవారికి గోల్డ్‌కార్డులు అందజేస్తారు. 50 నుంచి లక్ష రూపాయలు తీసుకునేవారికి డైమండ్‌ కార్డులు, లక్షకు పైబడి జీతం తీసుకునే వారికి ప్లాటినం కార్డులు ఇచ్చేందుకు బ్యాంకు నిర్ణయించింది. అయితే డైమెండ్‌ కార్డులు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో వాటి స్థానంలో గోల్డ్‌ కార్డులను మాత్రమే ఇస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో దిగ్గజమైన ఎస్‌బీఐ మాత్రమే ప్రస్తుతం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
 

 సేవింగ్‌ అకౌంటును రెగ్యులర్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయి శాలరీ అకౌంటుగా మార్చుకున్నాక దాని వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం...బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ ఉండాలన్న నిబంధన లేదు. ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకునే విషయంలో కూడా పరిమితులు ఉండవు. వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10  నుంచి 20 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. రూ.20  లక్షల బీమాకు ఏడాదికి వెయ్యి రూపాయలు, రూ.10 లక్షలకు 500  ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అయితే జీతం ప్యాకేజీ ఖాతాదారులు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత, గృహ, విద్యా రుణాలు తీసుకున్నవారి నుంచి బ్యాంకు అధికారులు ప్రొససింగ్‌ ఫీజు వసూలు చేస్తారు. కానీ ఎస్‌జీఎస్‌పీ ఖాతాదారులకు రుణాలకు సంబంధించి ప్రొససింగ్‌ ఫీజులో 50  శాతం రాయితీ ఉంటుంది. అలాగే లాకరు ఛార్జీలలో కూడా 20  శాతం రాయితీ పొందవచ్చు. డాక్యుమెంటేషన్‌ లేకుండా రెండు నెలల వేతనానికి సంబంధించి ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం కూడా కల్పిస్తారు. డీడీలకు ఛార్జీలు వసూలు చేయరు.