ఉత్తరాంధ్రను వణికిస్తున్న ' తితలీ '...

10:17 - October 11, 2018

ఉత్తరాంధ్రకు ముంచివున్న ' తితలీ ' తుఫాను ముప్పుపై వాతావరణ శాఖ ముందే రెడ్ మెసేజ్ జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగానే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో   ' తితలీ ' తుఫాను తీరం దాటింది. వజ్రపుకొత్తూరు మండలం తుఫాను తీరాన్ని దాటింది. తుఫాను తీరం దాటిన ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున రెండు గంటల సమయం వజ్రపుకొత్తూరు మండలం గొల్లపాడు- పల్లెసారథి వద్ద తుఫాను తీరాన్ని తాకింది. ఆ తరువాత మెల్లగా తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. సురక్షిత ప్రాంతాల్లో ప్రజలు తలదాచుకోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 53 కిలోమీటర్ల మేర తుఫాను కేంద్రం విస్తరించి ఉంది. బుధవారం రాత్రి నుంచే ఉత్తరాంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురవడం మొదలయ్యాయి. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాలో, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండటంతో తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించే అవకాశం ఉంది. తితలీ తాకిడికి దెబ్బతినే ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి తూర్పునావికా దళం సిద్ధమైంది. ఒడిశాతో పాటు కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి నష్టం జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన తూర్పు నావికాదళం ముందస్తు ఏర్పాట్లు చేసింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం అంతటా పెను గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాను ప్రభావం ఉద్దానం ప్రాంతంపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, సోంపేటలో కుండపోత వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 140 నుంచి 150 ఒక్కోసారి 165 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.