ఈసారి శబరిమలకు 550 మంది మహిళలు..

12:19 - November 10, 2018

శబరిమలలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన క్షణం నుంచి కేరళలో ఆందోళనలు పెచ్చరిల్లుతూనే ఉన్నాయి. సుప్రీం తీర్పును కూడా లెక్కచేయకుండా...మహిళలను ప్రవేశించకూడదూ అని శబరిమల అర్చకులు, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ శక్తులు అడ్డుకుంటూ ఆందోళనుల చేస్తున్నారు. దీంతో కేరళ పోలీసులు కూడా చేష్టలుడిగి చూస్తున్నారు. అయితే మహిళలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం ఇప్పుడు గమనార్హం. ఈసారి ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఇందులో 550మంది మహిళలు టికెట్లు బుక్ చేసుకోవడం శబరిమల భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నెల 16 నుంచి శబరిమల ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. మొత్తం 3 లక్షల 50వేల మందిలో 550 మంది మహిళలు ఉన్నట్టు దేవస్థానం తెలుపడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళ ప్రభుత్వం మహిళల ప్రవేశంపై పట్టుదలతో వ్యవహరిస్తోంది. ఒకరో ఇద్దరో వస్తే అడ్డు కోవడం భక్తులకు పెద్ద సమస్య కాదు. కానీ 550 మంది గుంపులుగా వస్తే ఏంటి పరిస్థితి అని భక్తి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భద్రత కల్పిస్తే ఎలా అడ్డుకుంటారన్నది వేచి చూడాల్సిందే..