ఇక త్రివిక్రమ్‌ ట్రెండ్‌ మార్చుకున్నట్లేనా?

17:11 - October 15, 2018

త్రివిక్రమ్‌ తీస్తున్న సినిమాలను చూస్తుంటే అతను పూర్తిగా ట్రెండ్‌ మార్చుకున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటారా? హాస్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా వుంటే త్రివిక్రమ్‌ ఇప్పుడు దానికి దూరంగా వుండి సినిమాలు తీస్తున్నారు. రచయితగా ఉన్నప్పట్నుంచి కామెడీ ఎంటర్ టైనర్లకు త్రివిక్రమ్ పెట్టింది పేరు. ‘అతడు’ కథ పరంగా సీరియస్ అయినా కూడా దాన్ని ఆయన వినోదాత్మకంగానే నడిపించారు. కొన్నిసార్లు త్రివిక్రమ్ సినిమాల్లో ఈ కామెడీ టచ్ ఎక్కువ కావడం వల్ల కొన్ని సీరియస్ కథలు కూడా చెడిపోయాయి. జల్సా.. ఖలేజా లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. ఈ విషయంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు త్రివిక్రమ్. కానీ ఇప్పుడు తన బలమైన వినోదాన్ని త్రివిక్రమ్ విడిచిపెట్టాడు. ‘అరవింద సమేత’లో ఓ సీరియస్ కథను ఇంటెన్సిటీతో చెప్పాడు. ఎమోషన్లను బాగా పండించాడు. గతంలో త్రివిక్రమ్ సినిమాల్లో ఏదైతే పెద్ద ప్లస్ అయ్యేదో అది ఇందులో మైనస్ అయింది. ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేసిన ట్రాక్ మొత్తం నిస్సారంగా మారింది. అసలేమాత్రం నవ్వించలేకపోయాడతను. ఇక ఇందులో హీరో ఎలివేషన్ సీన్లు.. ఎమోషనల్ సీన్లు మాత్రం బాగా పండాయి. ఆల్రెడీ ‘అజ్ఞాతవాసి’లోనూ త్రివిక్రమ్ వినోదం పండించలేకపోయాడు.  ప్రేక్షకులు కూడా అలాంటి కథలకు బ్రహ్మరథం పడుతున్నారు. ‘రంగస్థలం’.. ‘భరత్ అనే నేను’ ఈ కోవలోనే మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ‘అరవింద సమేత’ సైతం సీరియస్ సినిమానే. ఇది కూడా పెద్ద హిట్టయ్యేలా కనిపిస్తోంది.ఇదంతా చూస్తుంటే త్రివిక్రమ్‌ హాస్య ట్రెండ్‌ వదిలేసి..సీరియస్‌గా వుండే కథలను ఎంచుకుంటున్నారేమో అని వార్తలు వస్తున్నాయి.