ఇక ఎన్నికల ఖర్చు రూ.15 కోట్లు

15:06 - October 15, 2018

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలై దాదాపు రెండు నెలలు అవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ముందస్తు ఎన్నికలకు సంబంధించిన సంకేతాలు అందిన వెంటనే.. ఎవరికి వారు తమ ఎన్నికలకు అవసరమైన మొత్తాన్ని ముందే సమకూర్చుకున్నట్లు చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. ఈసారి ఎన్నికల ఖర్చు భారీగా పెరగటమే కాదు.. ప్రచారంలో తిరిగే చోటా మోటా నేతలతో పాటు.. కార్యకర్తల విషయంలో ఖర్చులు మునుపటి మాదిరి లేదని.. ఇప్పుడు మరింతగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రూ.5-10 కోట్ల మధ్య అయిన ఖర్చు.. ఈసారి ఎంత కానుంది? అన్నది ప్రశ్నగా మారింది. గతంలో లారీల్లో.. ట్రాక్టర్లలో జనాల్ని సమీకరిస్తే.. ఇప్పుడు పరిస్థితి మారిందని.. కార్లు.. జీపులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా మొదలైన ఖర్చు ప్రతి విషయంలోనూ భారీగా పెరిగినట్లుగా తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఎన్నికల్లో కీలకమైన ఓట్ల కొనుగోలు ఖర్చు పెద్దగా పెరగకున్నా.. అనుచర వర్గం.. ప్రచారం కోసం అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తక్కువలో తక్కువ ఒక్కో అభ్యర్థికి ఖాయంగా రూ.10 కోట్లు పక్కా అని చెబుతున్నారు. కొన్ని కీలకమైన స్థానాల్లో మాత్రం రూ.10నుంచి 15 కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే అక్కడి నాయకులు అందుకు ప్రిపేర్ అవుతున్నారు.  ఈసారి ఎన్నికల్లో మరో ప్రత్యేకత ఏమంటే.. ఈసారి బరిలోకి దిగే అభ్యర్థుల సగటు వయసు 55-62 మధ్య ఉండటం.. ఈసారి మిస్ అయితే..వచ్చే ఎన్నికల నాటికి ఆరోగ్యం సహకరిస్తుందా? అన్న అనుమానంతో పాటు.. పెరిగిన వయసును చూసి పార్టీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించే వీలుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అందుకే.. తమ జీవితంలో చివరి అవకాశంగా ఈ ఎన్నికల్ని భావిస్తున్న నేతలు లేకపోలేదు. అందుకే.. ఖర్చు గురించి వెనుకాడకుండా.. ఎంతైనా సరే.. గెలుపు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న మాటను పలువురి నోట వినిపిస్తోంది. ఇదే.. కోట్ల ఖర్చును అంతకంతకూ ఎక్కువయ్యేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది.