ఇక అన్నింటికీ ఆధార్‌ అక్కరలేదు

12:59 - December 20, 2018

బ్యాంకు ఖాతా తెరవాలన్నా - సిమ్ కార్డు కొనాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ దరఖాస్తు చేసుకోవాలన్నా, చివరకు పిల్లల్ని స్కూళ్లలో చేర్పించేటప్పుడు కూడా దాన్నే అడుగుతున్నారు అదేంటా అనుకుంటున్నారా...అదేనండీ ఆధార్‌. ఇక ఇప్పుడు ఇది అక్కరలేదు. నూతన మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై ఏ సంస్థ అయినా -  ఏ శాఖ అయినా చిరునామా ధ్రువీకరణ - గుర్తింపు కోసం ఆధార్ అడిగితే వాటిపై రూ.కోటి మేర జరిమానా విధించనున్నారు. అంతేకాదు 3-10 ఏళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు - సిమ్ కార్డు కొనేందుకు ఇక ఆధార్ అవసరమే లేదు. రేషన్ కార్డు - పాస్ పోర్టులకు దరఖాస్తు చేసే సమయంలోనూ ఆధార్ అక్కర్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ నిధులతో అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య అవసరమవుతుంది. వినియోగదారులు తమ ఇష్టపూర్వకంగా కేవైసీ ప్రక్రియకు ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చునని కేంద్రం తాజా నిబంధనలతో స్పష్టం చేసింది. ఇదిలా వుంటే... ఆధార్ నమోదు సమయంలో సేకరించే వివరాలను దుర్వినియోగం చేసిన వారిపై రూ.50 లక్షల జరిమానా పడుతుంది. వారికి 10 ఏళ్ల జైలు శిక్ష కూడా వేస్తారు. వినియోగదారుల అనుమతి లేకుండా ఎవరైనా వారి ఆధార్ వివరాలు సేకరిస్తే రూ.10 వేల జరిమానా - మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఈ నిబంధనలన్నీ అమల్లోకి వస్తాయి.