ఆ సన్నివేశాలు ఇందులో ఉండవు: శంకర్‌

14:04 - November 27, 2018

రజనీకాంత్-శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘2.0’ ఇంకో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ‘రోబో’కు సీక్వెల్ కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. ‘రోబో’లో అంచనాల్ని మించిన వినోదం పంచిన శంకర్.. ఈసారి అంచనాలకు దగ్గరగా వచ్చినా గొప్పే అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ‘2.0’ ట్రైలర్ అయితే అంచనాలకు తగ్గట్లు లేదు. ప్రేక్షకులు ఆశించిన అంశాలు ఇందులో కనిపించలేదు. ‘రోబో’లో మాదిరి వినోదం.. రొమాన్స్ ఇందులో ఉన్నట్లుగా కనిపించలేదు. ఒకవేళ ట్రైలర్ వరకు అవి దాచి పెట్టి సినిమాలో ఏమైనా చూపిస్తారేమో అన్న ఆశ జనాల్లో ఉంది. కానీ అందుకు అవకాశం లేదని స్పష్టం చేశాడు శంకర్. ‘రోబో’ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునే వినోదాత్మక సన్నివేశాలు - రొమాన్స్ ఉన్నాయి కదా.. అలాంటివి ‘2.0’లోనూ ఉంటాయా అని అడిగితే.. ‘రోబో’లో ఉన్నవన్నీ ఇందులో కూడా ఎలా ఆశిస్తారు అని ఎదురు ప్రశ్నించాడు శంకర్. ‘2.0’లో కొత్త అంశాలు ఉంటాయని.. వాటిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారని శంకర్ చెప్పాడు. ఇది కంప్లీట్ యాక్షన్ ఫిలిం అని చెప్పడం ద్వారా కామెడీ - రొమాన్స్ లాంటి వాటిపై మాత్రం ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పాడు.  ‘రోబో’లో మాదిరి ఎంటర్టైన్మెంట్ - రొమాన్స్ లేకుంటే ప్రేక్షకులు బోర్ ఫీలవ్వరా అని సందేహాలు కలుగుతున్నాయి. ప్రేక్షకులు 2.ఓని బోర్‌ ఫిలవుతారో..యాక్షన్‌ సినిమా కాబట్టి ఇంట్రెస్ట్‌గా చూస్తారో...అనేది ఈ గురువారం దాకా ఆగి చూడాల్సిందే.