ఆ రెండు అంశాలపై మౌనమెందుకు కాగ్‌...?

10:24 - November 14, 2018

మోదీ సర్కారు ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటోందన్నది విపక్షాల ఆరోపణ! ఈ జాబితాలో రాజ్యాంగ సంస్థ ' కాగ్‌ 'ను కూడా చేర్చారా? ఇది... 60  మంది మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసుల మాజీ అధికారులు చేసిన అభియోగం! '' సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయే ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా కాగ్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. అత్యంత కీలకమైన నోట్ల రద్దు, రాఫెల్‌పై నివేదికలు ఇవ్వకుండా ఉద్దేశపూర్వక జాప్యం చేస్తోంది '' అని వీరు ఆరోపించారు. 2జీ, బొగ్గు, ఆదర్శ్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌పై కాగ్‌ ఇచ్చిన నివేదికలు యూపీఏ సర్కారుపై ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేశాయని వీరు గుర్తు చేశారు. '' నోట్ల రద్దు ప్రభావం, బ్యాంకులు ఇచ్చిన సమాచారం, కొత్త నోట్ల ముద్రణకు పెట్టిన ఖర్చు, సంచిత నిధికి ఆర్బీఐ ఇచ్చిన డివిడెండ్‌... ఈ మొత్తంపై సమగ్ర పరిశీలనాత్మక నివేదిక సమర్పిస్తామని కాగ్‌ శశికాంత్‌ శర్మ 20 నెలల కిందట ప్రకటించారు. కానీ... ఇప్పటిదాకా ఆ నివేదిక ఊసే లేదు. రాఫెల్‌పైనా ఈ ఏడాది సెప్టెంబరులోనే కాగ్‌ నివేదిక ఇస్తుందని వార్తలు వచ్చాయి. దానిపైనా ఇప్పటికీ స్పష్టత లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్డీయేను ఇబ్బంది పెట్టకూడదనే నోట్ల రద్దు, రాఫెల్‌పై కాగ్‌ మౌనం పాటిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది''  అని మాజీ అధికారులు తెలిపారు. వెంటనే ఈ రెండు అంశాలపై కాగ్‌ నివేదిక సమర్పించాలని... దీనిని శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుంచాలని డిమాండ్‌ చేశారు. కీలకమైన అంశాలపై నివేదికలు ఇవ్వకుండా ఆలస్యం చేయడం ఏమాత్రం సరికాదని మాజీ అధికారులు పేర్కొన్నారు. ' కాగ్‌ ' పక్షపాతధోరణి ప్రదర్శిస్తున్నట్లుగా భావించ వచ్చునని తెలిపారు. అంతేకాదు... అత్యంత ముఖ్యమైన వ్యవస్థ విశ్వసనీయత సంక్షోభంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ' కాగ్‌ ' నివేదికల ఆధారంగా ఓటర్లు తమ అభిప్రాయం మార్చుకుంటారు. ఈ దేశ ప్రజల ధనానికి కాగ్‌ కాపలాదారు అని... ప్రతి లావాదేవీ, అనుమతి నిబంధన ప్రకారమే సాగేలా చూడాలని తెలిపారు.