ఆ తేదీనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనట!..

12:02 - October 3, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చాలా ఉత్సాహంతో అసెంబ్లీ రద్దు చేయించారు. ఇదే నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థులను 105 మందిని ప్రకటించడం కూడా జరిగింది. ఇదిలా వుంటే...రాష్ట్రంలో ఎన్నికలు నవంబర్‌లో వుంటాయన్నట్లు సమాచారం వుంది. అయితే ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత బంతి ఈసీ కోర్టులో పడింది. ఎన్నికలు అన్నంతనే.. ఇట్టే జరిగిపోవు. దానికి ముందు భారీ కసరత్తు ఉంటుంది. ఎన్నికల్లో కీలకమైన ఓటర్ల జాబితాను ప్రకటించటం.. ఆ తర్వాతే ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంటుంది. మరి.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని ఈసీ ఎప్పుడు ప్రకటిస్తుంది? అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ఆసక్తికర ప్రశ్న.

దీనికి సమాధానం వెతికితే...ఎన్నికలకు కీలకమైన ఓటర్ల జాబితా ఈ నెల 8 నాటికి ప్రకటిస్తారు. ఇది జరిగిన రెండు మూడు రోజులకు ఎన్నికల కమిషన్ ప్రకటన ఉంది. అంటే..ఈ నెల 12న ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికల కమిషన్ ప్రతి మంగళవారం.. శుక్రవారం సమావేశం అవుతుంది. ఇప్పుడు చెప్పుకున్న లెక్కలో.. ఎనిమిదిన ఓటర్ల జాబితాను విడుదల చేస్తే.. ఆ తర్వాతి రెండు.. మూడు రోజులకు అంటే పది.. పదకొండు తేదీల్లో ఎన్నికల కమిషన్ సభ్యులు రాష్ట్రంలో పర్యటించి.. ఎన్నికలకు ఉన్న అనుకూల వాతావరణం ఏమిటన్నది మదింపు చేస్తారు. ఆ వెంటనే అంటే.. 12న  శుక్రవారం కావటం గమనార్హం. ఆ రోజున యథావిధిగా ఈసీ సమావేశం ఉంటుంది కాబట్టి.. అప్పటికే ఎన్నికల సంఘం సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో తమ పర్యటనను ముగిస్తారు కాబట్టి.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అంశాన్ని పరిశీలించి.. దానిపై చర్చించే అవకాశం శుక్రవారం జరిగే మీటింగ్ లో ఎక్కువగా ఉంది. ఎన్నికల్ని మిగిలిన నాలుగు రాష్ట్రాల కంటే ముందే నిర్వహించాలన్న సంకేతాలు బలంగా వస్తున్న నేపథ్యంలో 12న తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.